Hair Fall | ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. శిరోజాలు రాలిపోవడం అన్నది కామన్ అయిపోయింది. చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దల వరకు ఆడ, మగ అన్న తేడా లేకుండా హెయిర్ ఫాల్ అనేది సమస్యగా మారింది. దీన్నే అలోపేసియా అని కూడా అంటారు. హెయిర్ ఫాల్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందులు పెడుతున్న సమస్యల్లో హెయిర్ ఫాల్ కూడా ఒకటి. సాధారణంగా మనకు రోజుకు 50 నుంచి 100 వరకు వెంట్రుకలు రాలిపోతుంటాయి. కానీ అంతకు మించితే దాన్ని హెయిర్ ఫాల్గా పరిగణించాలి. కొందరికి వంశ పారంపర్యంగా శిరోజాలు రాలిపోతుంటాయి. కొందరు పురుషుల్లో స్త్రీ హార్మోన్లు, స్త్రీలలో పురుష హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా కూడా జుట్టు రాలుతుంది.
స్త్రీలకు గర్భధారణ, ప్రసవం, మెనోపాజ్ దశల్లో జుట్టు బాగా రాలిపోతుంది. స్త్రీలు, పురుషులు ఎవరికైనా సరే థైరాయిడ్ సమస్య ఉంటే వారికి కూడా జుట్టు బాగా రాలిపోతుంది. మహిళల్లో ప్రస్తుతం చాలా మందికి పీసీవోఎస్ అనే సమస్య వస్తోంది. ఇది ఉన్న మహిళలకు కూడా జుట్టు నిరంతరాయంగా రాలిపోతూనే ఉంటుంది. కొన్ని రకాల మందులను వాడడం లేదా జుట్టు కుదుళ్ల వద్ద ఇన్ఫెక్షన్ ఉండడం, చర్మ సమస్యలు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేదా అనారోగ్యాలు ఉండడం, పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, శిరోజాలకు చేయించుకునే బ్యూటీ పార్లర్ చికిత్సలు పడకపోవడం వంటి అనేక కారణాల వల్ల హెయిర్ ఫాల్ వస్తుంది. అయితే జుట్టు రాలిపోవడం అన్నది సాధారణ సమస్యే. ఇందుకు ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలు అవసరం లేదు. మన ఇంట్లో లభించే పదార్థాలతోనే సహజసిద్ధమైన చిట్కాలను వాడి జుట్టు రాలే సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తింటుంటే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. విటమిన్లు ఎ, బి, సి, డి, ఇలతోపాటు ఐరన్, ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, బయోటిన్, విటమిన్ సి ఉండే ఆహారాలను తింటుండాలి. మీ జుట్టుకు తరచూ కొబ్బరినూనె, బాదంనూనె, ఆలివ్ ఆయిల్, ఆముదం, రోజ్మేరీ ఆయిల్ వంటి నూనెల్లో ఏదో ఒక దానితో మర్దనా చేస్తుండాలి. జుట్టుకు నూనెను రాసి రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. లేదా నూనె రాసిన తరువాత గంట పాటు ఆగి తలస్నానం చేయవచ్చు. ఇలా చేస్తున్నా కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయరసాన్ని జుట్టుకు బాగా మర్దనా చేసి 30 నిమిషాలు ఆగి తలస్నానం చేస్తున్నా కూడా జుట్టు రాలడం ఆగిపోతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి.
జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడంలో కలబంద గుజ్జు కూడా బాగానే పనిచేస్తుంది. కొద్దిగా అలొవెరా జెల్‌ను తీసుకుని జుట్టు కుదుళ్లకు నేరుగా అప్లై చేయాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతాయి. కాంతివంతంగా కనిపిస్తాయి. శిరోజాలకు మెంతుల మిశ్రమాన్ని కూడా అప్లై చేయవచ్చు. రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను ఉదయం పేస్ట్‌లా చేసి దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా సమస్య తగ్గిపోతుంది. శిరోజాలకు పోషణను అందించడంలో, జుట్టు పెరిగేలా చేయడంలో ఉసిరికాయ జ్యూస్ కూడా బాగానే పనిచేస్తుంది. దీన్ని జుట్టుకు నేరుగా పట్టించవచ్చు. లేదా ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఈ రసాన్ని తాగవచ్చు. అలాగే ఒక కోడిగుడ్డులో కాస్త తేనె కలిపి జుట్టుకు రాసి 20 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఈ చిట్కా కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. శిరోజాలకు సహజసిద్ధమైన నిగారింపు తెస్తుంది.