Brown Bread | జ్వరం వచ్చి అనారోగ్యం పాలైనప్పుడు చాలా మంది ఆహారం తినలేకపోతుంటారు. అలాంటి వారికి బ్రెడ్, పాలు ఇస్తారు. దీంతో తేలిగ్గా జీర్ణం అవడమే కాదు, తక్షణ శక్తి లభిస్తుంది. త్వరగా కోలుకుంటారు. అయితే బ్రెడ్‌లో అనేక రకాలు ఉంటాయి. కానీ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే బ్రౌన్ బ్రెడ్‌ను తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. ఇంతకీ అసలు బ్రౌన్ బ్రెడ్ అంటే ఏమిటి..? దీన్ని ఎలా తయారు చేస్తారు..? ఇది మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఏమిటి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రౌన్ బ్రెడ్ అంటే దాన్ని మిల్లెట్లు లేదా గోధుమలతో తయారు చేస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. కనుకనే తెలుపు రంగు బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్‌ను తినాలని సూచిస్తుంటారు. ఆరోగ్య ప్రయోజనాలతోపాటు పోషకాలను పొందాలంటే బ్రౌన్ బ్రెడ్‌ను తినడం ఉత్తమమైన మార్గమని అంటున్నారు.
బ్రౌన్ బ్రెడ్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. పేగుల్లో మలం సులభంగా కదిలేలా చేస్తుంది. దీంతో సుఖ విరేచనం అవుతుంది. బ్రౌన్ బ్రెడ్ లో ఉండే ఫైబర్ ప్రీ బయోటిక్ పదార్ధంగా పనిచేస్తుంది. అంటే ఈ బ్రెడ్‌ను తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందన్నమాట. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ బ్రెడ్‌ను తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువును తగ్గించుకోవాలి అనుకునేవారు, ఆకలిని నియంత్రించాలి అనుకునే వారు బ్రౌన్ బ్రెడ్‌ను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ బ్రెడ్‌ను తినడం వల్ల బరువును తగ్గించుకోవడంతోపాటు బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా తేలికవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బ్రౌన్ బ్రెడ్‌ను తినడం వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కనుక ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను అమాంతం పెంచదు. నెమ్మదిగా పెంచుతుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ బ్రెడ్‌ను నిరభ్యంతరంగా తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవడం తేలికవుతుంది. ఈ బ్రెడ్‌లో ఉండే ఫైబర్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. ఈ బ్రెడ్‌లో ఫినోలిక్ యాసిడ్లు, లిగ్నన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. బీపీని నియంత్రణలో ఉంచుతాయి. హైబీపీ ఉన్నవారు బ్రౌన్ బ్రెడ్‌ను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడి బీపీ నియంత్రణలో ఉంటుంది.
బ్రౌన్ బ్రెడ్‌లో పలు రకాల బి విటమిన్లు ఉంటాయి. ఈ బ్రెడ్‌లో థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తి లభించేలా చేస్తాయి. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గిపోతాయి. శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బ్రౌన్ బ్రెడ్‌లో ఉండే మెగ్నిషియం కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో కండరాల నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. ఈ బ్రెడ్‌లో అధికంగా ఉండే జింక్ మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ బ్రెడ్‌లో ఉండే మాంగనీస్ యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇలా బ్రౌన్ బ్రెడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.