Junk Foods | సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. వేడి వేడిగా నూనెలో వేయించి తీసే పకోడీలు, పునుగులు, బజ్జీల వంటి వాటితోపాటు పిజ్జాలు, బర్గర్స్, చాట్, చిప్స్ వంటివి తినేందుకు ఇష్టపడుతుంటారు. సాయంత్రం సమయంలో సహజంగానే చాలా మందికి కాస్త ఆకలిగా అనిపిస్తుంది. దీంతో జంక్ ఫుడ్‌ను తిని పొట్ట నింపుకుంటారు. అయితే వాస్తవానికి ఇలా జంక్ ఫుడ్‌ను తరచూ తినడం అసలు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. జంక్ ఫుడ్ అంటే.. అత్యధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు అని అర్థం. ఇవి క్యాలరీలను అధికంగా ఇస్తాయి. పోషకాలు అసలు ఏమాత్రం ఉండవు. విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు ఈ పదార్థాల్లో ఉండవు.
జంక్ ఫుడ్ అంటే యువతకు పిజ్జాలు, బర్గలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, శీతల పానీయాలు, చాక్లెట్లు, కేకులు గుర్తుకు వస్తాయి. కానీ బజ్జీలు, సమోసాలు వంటివి కూడా జంక్ ఫుడ్ కిందకే వస్తాయి. అవేమో విదేశీ జంక్ ఫుడ్, ఇవి స్వదేశీ జంక్ ఫుడ్ అన్నమాట. వాటికి, వీటికి పెద్ద తేడా ఉండదు. వేటిని తిన్నా కూడా ఆరోగ్యానికి హానికరమే. జంక్ ఫుడ్ వాస్తవానికి చాలా రుచిగా ఉంటుంది. కనుకనే చాలా మంది ఆ రుచికి దాసోహం అంటారు. తిన్న కొద్దీ తినాలపిస్తుంది. అందుకు కారణం వాటిల్లో వాడే పదార్థాలే అని చెప్పవచ్చు. వాటి వల్ల ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలు ఏర్పడుతాయి. జంక్ ఫుడ్‌లో రిఫైన్ చేయబడిన పిండి పదార్థాలు, చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను అమాంతం పెంచేస్తాయి. దీని వల్ల కణాలకు త్వరగా గ్లూకోజ్ లభించదు. దీర్ఘకాలంలో ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, బద్దకం కూడా ఉంటాయి. అందుకనే కొందరు జంక్ ఫుడ్ తిన్న వెంటనే బద్దకంగా కనిపిస్తారు.
జంక్ ఫుడ్‌లో ఫైబర్ అసలే ఉండదు. ఉన్నా చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల అలాంటి ఫుడ్స్‌ను తింటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. జంక్ ఫుడ్‌లో కొవ్వులు అత్యధిక స్థాయిలో ఉంటాయి. ఇవి జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో అజీర్తి వస్తుంది. పైగా ఈ కొవ్వులు శరీరంలో అధికంగా చేరితే క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు. జంక్ ఫుడ్‌ను తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు అసాధారణ రీతిలో ఉంటాయి. దీంతో అది మూడ్‌పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఏకాగ్రత దెబ్బ తింటుంది. ఏ పనిపై దృష్టి పెట్టలేకపోతారు. జ్ఞాపకశక్తి సైతం నశిస్తుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం జంక్ ఫుడ్‌ను తినడం వల్ల తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన బారిన పడతారని తేలింది. ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
జంక్ ఫుడ్‌ను తింటే వాటిల్లో ఉండే చక్కెర, పిండి పదార్థాల కారణంగా రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. దీంతో హార్మోన్లలో తీవ్రమైన మార్పులు వస్తాయి. ఇది శరీరంలో అంతర్గతంగా వాపులకు దారి తీస్తుంది. మొటిమలకు సైతం కారణమవుతుంది. మీకు సడెన్‌గా మొటిమలు వస్తున్నాయంటే మీరు జంక్ ఫుడ్‌ను అధికంగా తింటున్నారేమో చెక్ చేసుకోండి. ఈ ఫుడ్‌ను ఎక్కువగా తింటుంటే ఆ అలవాటును మానే ప్రయత్నం చేయండి. దీంతో మొటిమలు వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగే జంక్ ఫుడ్‌ను తరచూ అధికంగా తినడం వల్ల బరువు పెరిగి టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఈ ఫుడ్‌లో సోడియం అధికంగా ఉంటుంది కనుక ఇది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో దీర్ఘకాలంలో కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా చేరి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. ఇది గుండె పోటుకు కారణమవుతుంది. కనుక జంక్ ఫుడ్‌ను తింటున్నవారు ఇప్పటికైనా ఆ ఆహారాలను తినడం తగ్గించాలి. లేదంటే తీవ్ర దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.