Weight Loss Drinks | ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే బరువును తగ్గించేందుకు అనేక పద్థతులను పాటిస్తున్నారు. వ్యాయామం చేయడం లేదా జిమ్‌కు వెళ్లడం, యోగా వంటివి పాటిస్తున్నారు. అయితే కేవలం వ్యాయామాలు, యోగా మాత్రమే కాదు, బరువు తగ్గాలంటే ఆహారం విషయంలోనూ అనేక జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. రోజూ తీసుకునే ఆహారంలో పలు మార్పులను చేసుకోవాలి. దీంతో బరువును తగ్గించుకోవడం చాలా తేలికవుతుంది. ఇక బరువును తగ్గించుకునేందుకు మనకు పలు సహజసిద్ధమైన పానీయాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏవైనా రెండు పానీయాలను రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ఇవి సహజసిద్ధమైనవి మాత్రమే కాదు, బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను సైతం అందిస్తాయి. ఇక ఆ పానీయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది గ్రీన్ టీని సేవిస్తుంటారు. అధిక బరువును తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కాటెకిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. స్వల్ప మొత్తంలో కెఫీన్ కూడా ఉంటుంది. అందువల్ల గ్రీన్ టీని తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. రోజుకు 2 లేదా 3 కప్పుల గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకుంటే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీలో చక్కెర కలపకుండా తాగితేనే ఉపయోగం ఉంటుంది. గ్రీన్ టీని సేవించడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువును తగ్గించేందుకు బ్లాక్ కాఫీ కూడా పనిచేస్తుంది. ఇందులో కెఫీన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మెటబాలిజంను పెంచి కొవ్వు కరిగేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. బ్లాక్ కాఫీని కూడా చక్కెర లేకుండానే సేవించాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.
రోజూ ఉదయం పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగితే ఉదయాన్నే శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు రోజూ నిమ్మకాయ నీళ్లను తాగుతున్నా కూడా ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే బరువును తగ్గించుకోవచ్చని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. ఇందులో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. ఆహారం తక్కువ తినేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్‌ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజులో ఒకసారి భోజనానికి 30 నిమిషాల ముందు తాగుతుంటే ఫలితం ఉంటుంది.
అధిక బరువును తగ్గించడంలో అల్లం టీ కూడా పనిచేస్తుంది. ఇందులో థర్మోజెనిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల అల్లం టీని తాగితే శరీర మెబటాలిజం పెరుగుతుంది. దీంతో జీర్ణశక్తి మెరుగు పడుతుంది. గ్యాస్ తగ్గుతుంది. శరీరంలోని కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. అల్లం టీలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి కూడా తాగవచ్చు. కానీ చక్కెర కలపకూడదు. జీలకర్ర మన అందరి ఇళ్లలోనూ ఉంటుంది. బరువు తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయం చేస్తుంది. జీలకర్ర నీళ్లను రోజూ ఒక కప్పు మోతాదులో రోజులో ఏదైనా సమయంలో తాగాల్సి ఉంటుంది. దీంతో కొవ్వును కరిగించుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది. ఇలా ఈ సహజసిద్ధమైన పానీయాలను సేవించడం వల్ల బరువు చాలా సులభంగా తగ్గుతారు.