Proteins | మన శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. మన శరీరంలో కణాల మరమ్మత్తుకు, ఎంజైమ్ ల తయారీకి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, జుట్టు పెరుగుదలకు ఇలా అనేక అవసరాలకు ప్రోటీన్ అవసరమవుతుంది. మన శరీర వయసు, బరువును బట్టి ప్రోటీన్ అవసరాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. చికెన్ బ్రెస్ట్, గుడ్లు, చేపలు వంటి వాటిల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని అందరూ తీసుకోలేరు. వీటిని అధిక మొత్తంలో తరచూ తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక మనం జీర్ణవ్యవస్థకు, పేగుల ఆరోగ్యానికి హాని కలగని ప్రోటీన్ ఉండే ఆహారాలను తీసుకోవడం అవసరం. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల పేగులకు సులభంగా ఉండడంతో పాటు శరీరానికి కావల్సిన ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. పేగుల ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థకు మేలు చేసే ప్రోటీన్ రిచ్ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక ప్రోటీన్ తో పాటు అవసరమైన పోషకాలు ఉండే ఆహారాల్లో పనీర్ ఒకటి. పనీర్ ప్రోటీన్ అద్భుతమైన మూలం. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ అందడంతో పాటు జీర్ణ ఆరోగ్యానికి మద్దతు లభిస్తుంది. రోగనిరోధక శక్తి బలంగా తయారవుతుంది. తక్కువ కార్బ్ డైట్స్ చేసే వారికి పనీర్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. అలాగే సోయాబీన్స్ తో చేసే టోఫును తీసుకోవడం వల్ల మనకు పనీర్ ఎక్కువ పోషకాలు అందుతాయి. సోయాబీన్స్ పాల నుండి టోఫును తయారు చేస్తారు. దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండడంతో పాటు శరీర పెరుగుదలకు, అభివృద్దికి అవసరమైన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కూడా ఉన్నాయి. 100గ్రాముల టోఫులో 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. టోఫును తీసుకోవడం వల్ల ప్రోటీన్ తో పాటు ఇతర ముఖ్య పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయి. పేగుల ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా ఉంటుంది.
టెంపే లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని పులియబెట్టిన సోయాబీన్స్ నుండి తయారు చేస్తారు. దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియ, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. టెంపేలో కూడా ప్రోటీన్ తో పాటు అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. 100గ్రా. టెంపేలో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పనీర్ కంటే టెంపేను తీసుకోవడం వల్ల మనం ఎక్కువ ప్రోటీన్ ను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక మొలకెత్తిన పెసలను తీసుకోవడం వల్ల కూడా మనం తగినంత ప్రోటీన్ ను పొందవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా మనం సులభంగా బరువు తగ్గవచ్చు.
అంతేకాకుండా పెసలను నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ విచ్చిన్నమవుతుంది. ఐరన్, జింక్, క్యాల్షియం వంటి పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కనుక డయాబెటిస్ తో బాధపడే వారు కూడా తీసుకోవచ్చు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక రోజూ అర కప్పు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పెరుగులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. బరువు తగ్గడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. 100గ్రాముల పెరుగులో 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శరీరానికి కావల్సిన ప్రోటీన్ లతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు కలుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.