Nuts And Seeds | మన శరీర ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పనితీరుకు, శక్తి స్థాయిలకు, శరీర అవసరాలకు పోషకాలు చాలా అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మానసిక స్థితితో పాటు శారీరక పనితీరు మెరుగుపడుతుంది. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉండే ఆహారాల్లో గింజలు కూడా ఒకటి. ఇవి పోషకాలకు శక్తివంతమైన వనరు అని చెప్పవచ్చు. గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి, ఇ లతో పాటు మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఎన్నో ఉంటాయి. గింజలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆహారంలో భాగంగా గింజలను తీసుకోవడం వల్ల మనం పోషకాహార లోపాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.
వీటిలో ఒమెగా 3, ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయడపడతాయి. గింజలను తీసుకోవడం వల్ల మెదడు పనితీరుతో పాటు అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. గింజల్లో ఉండే ఫైబర్ మనకు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. తద్వారా మనం తక్కువ ఆహారాన్ని తీసుకునే వీలు కలుగుతుంది. బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దోహదపడతాయి. అలాగే గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. గింజలను తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిత్తాశయ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. పిత్తాశయ రాళ్ల ప్రమాదం తగ్గుతుంది.
గింజలను తీసుకోవడం వల్ల యాసిడ్ రిప్లెక్షన్ సమస్య తగ్గుతుంది. పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది. గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వృద్దాప్య ఛాయలను తగ్గించడంలో దోహదపడతాయి. ఇలా గింజలు మనకు అనేక రకాలుగా మేలు చేసినప్పటికీ వీటిని తగిన మోతాదులో తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక రోజూ ఒక గుప్పెడు మోతాదులో మాత్రమే వీటిని తీసుకోవాలి. అలాగే నూనె, చక్కెర, ఉప్పు వంటి వాటిని జోడించని గింజలను మాత్రమే తీసుకోవాలి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు.
రోజూ ఒకేరకం గింజలు కాకుండా బాదం, వాల్నట్స్, జీడిపప్పు, పిస్తా, బ్రెజిల్ నట్స్ ఇలా అన్ని రకాల గింజలను తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఈ గింజలను పెరుగు, ఓట్ మీల్, సలాడ్ వంటి వాటితో కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. రోజువారీ ఆహారంలో గింజలను చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.