Fruits | మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల పండ్లు మనకు సీజనల్‌గా లభిస్తాయి. ఇంకొన్ని మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అయితే సీజన్లలో లభించే పండ్లను తినడంతోపాటు ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉండే పండ్లను సైతం తరచూ తినాల్సి ఉంటుంది. దీంతో శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతోపాటు రోగాలు రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. అయితే కొన్ని రకాల పండ్లను కొందరు పొట్టు తీసి తింటుంటారు. కానీ అలా చేయకూడదు. పొట్టు తీయకుండానే తినాలి. దీంతో ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇక ఏయే పండ్లను పొట్టుతో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జామ పండ్లలో విటమిన్లు, మినరల్స్ అనేకం ఉంటాయి. ఈ పండ్లను కొందరు పొట్టు తీసి తింటారు. కానీ వీటిని పొట్టుతోనే తినాల్సి ఉంటుంది. జామ పండ్లను పొట్టుతో తినడం వల్ల ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి మనల్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాల నుంచి రక్షిస్తాయి. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అలాగే అంజీర్ పండ్లను కూడా పొట్టుతోనే తినాల్సి ఉంటుంది. వీటి పొట్టులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి. అదేవిధంగా యాప్రికాట్స్‌ను కూడా పొట్టుతోనే తినాల్సి ఉంటుంది. యాప్రికాట్స్ మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. ఇవి కాకుండా సాధారణ పండ్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. వీటిని పొట్టుతో సహా తినాలి. దీంతో ఫైబర్, విటమిన్లు ఎ, సి లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వేసవిలో మనకు మామిడి పండ్లు అధికంగా లభిస్తాయి. ఈ సీజన్లోనూ మనకు అక్కడక్కడా ఈ పండ్లు కనిపిస్తుంటాయి. అయితే ఈ పండ్లను కూడా తొక్కతోనే తింటే మంచిది. కార్బైడ్ వేసి పండించిన పండ్లను మనం తొక్కతో తినలేం. కానీ సహజసిద్ధంగా పండిన పండ్లను మాత్రం కచ్చితంగా తొక్కతోనే తినాల్సి ఉంటుంది. మామిడి పండ్ల తొక్కలో అనేక విటమిన్లు, మినరల్స్‌తోపాటు ఫైబర్ ఉంటుంది. దీంతో జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చెర్రీ పండ్లను కూడా పొట్టుతోనే తినాలి. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి. మనకు అనేక లాభాలను అందిస్తాయి. ఈ పండ్లను పొట్టుతో తింటే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. వీటిని మనం సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలోనూ తినవచ్చు.
పీచ్ అనే పండ్లను కూడా పొట్టుతో తింటేనే మేలు జరుగుతుంది. ఈ పండ్లకు చెందిన పొట్టులో ఫైబర్, విటమిన్లు ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల పీచ్ పండ్లను పొట్టుతో సహా తింటే 2 నుంచి 3 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. అలాగే విటమిన్ సి కూడా పొందవచ్చు. ఇవి మనకు రోగాలు రాకుండా రక్షిస్తాయి. ఇక ప్లమ్ అనే పండ్లను కూడా పొట్టుతో సహా తింటేనే మేలు జరుగుతుంది. వీటి పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. అలాగే ద్రాక్ష పండ్లను కూడా పొట్టుతో సహా తినాలి. కొందరు లోపలి గుజ్జు తిని తొక్కను ఉమ్మేస్తారు. అలా చేయకూడదు. అన్ని రకాల పోషకాలు లభించాలంటే మనం ద్రాక్ష పండ్లను కూడా పొట్టుతో సహా తినాల్సి ఉంటుంది. ఇలా పలు రకాల పండ్లను మనం పొట్టుతో తింటేనే ఎక్కువ ఫలితాలను పొందవచ్చు.