Millets | ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలను తీసుకోవడం, శరీరాన్ని సిద్ధం చేయడం అవసరంగా మారింది. చాలా మంది తీసుకునే ఆహారం శరీర అంతర్గత ఉష్ణోగ్రతపై ప్రభావం చూపడంతోపాటు, రికార్డు స్థాయిలో పెరుగుతున్న వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది. భారతీయ వేసవి కాలాలు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందువల్ల ముందస్తు జాగ్రత్తగా జొన్నలు, రాగులు వంటి మిల్లెట్లను ఆహారంలో చేర్చడం అవసరం. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు, మాక్రో, మైక్రో పోషకాలతో శరీరాన్ని పోషిస్తాయి. అంతేకాకుండా వేసవిలో మిల్లెట్ల వినియోగం పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. ఇవి తక్కువ కాలంలో పెరిగే పంటలు కావడంతోపాటు, తక్కువ నీటితో పెరుగుతాయి. పోషకాల సమృద్ధిగా ఉన్న ఈ ధాన్యాలు వేడిని తగ్గించడంలో సహాయపడటంతో పాటు, వేసవిలో సాధారణంగా కనిపించే అలసట సమస్యను కూడా తగ్గిస్తాయి.
సాధారణంగా మిల్లెట్లు శీతాకాలంతో సంబంధం ఉన్నవిగా భావించినప్పటికీ, కొన్ని రకాల మిల్లెట్లు సహజంగా చల్లదనాన్ని కలిగించే లక్షణాలు కలిగి ఉంటాయి. సరైన మిల్లెట్లను ఎంచుకుంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటం, వేసవి అలసటను తగ్గించడం సాధ్యమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మిల్లెట్లు అధిక ఫైబర్, తేమను అందిస్తాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. వేసవిలో వేడి కారణంగా జీర్ణక్రియ మందగించడం సాధారణం. ఈ నేపథ్యంలో మిల్లెట్లు తీసుకోవడం ప్రయోజనకరం. పరిశోధనలు కూడా మిల్లెట్ల వినియోగం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నాయి. వేసవిలో తీసుకోదగిన ఉత్తమ మిల్లెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో తీసుకోవాల్సిన ఉత్తమ మిల్లెట్లలో రాగి ముఖ్యమైనది. గాఢ రంగులో ఉండటం వల్ల దీనిని హీటింగ్ ఫుడ్ గా భావిస్తారు. అయితే వాస్తవానికి ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండటంతో వేసవిలో వచ్చే అలసటను తగ్గిస్తుంది. రాగి అంబలి, రాగి మాల్ట్ రూపంలో తీసుకోవడం మంచిది. అలాగే రాగితో ఇడ్లీ, దోశలు తయారు చేసుకోవచ్చు. జొన్నలు కూడా వేసవికి అనుకూలమైన ధాన్యం. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచవు. పొటాషియం, ఫాస్పరస్ అధికంగా ఉండటం వల్ల చెమట ద్వారా కోల్పోయే ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తాయి. జొన్న రోటీలు లేదా భాక్రీల రూపంలో తీసుకుంటే మంచిది. పెరుగు లేదా కీరదోస రైతాతో కలిపి తీసుకుంటే మరింత చల్లదనాన్ని ఇస్తుంది. ఊదలు (బార్న్యార్డ్ మిల్లెట్) తక్కువ కేలరీలతో ఉండే ధాన్యం. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. వేసవిలో తేలికపాటి ఖిచ్డీ లేదా కూరగాయల పులావ్ రూపంలో తీసుకోవచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని ఒక్కసారిగా పెంచకుండా నియంత్రిస్తాయి. కోడో మిల్లెట్ కూడా వేసవికి అనువైన ఆహారం. ఇందులో విటమిన్ బి సమూహం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటంలో సహాయపడతాయి. కోడో మిల్లెట్‌తో పెరుగన్నం తయారు చేసుకుని తీసుకుంటే శరీరానికి చల్లదనం కలుగుతుంది.
కొర్రలు (ఫాక్స్‌టెయిల్ మిల్లెట్) తేలికగా జీర్ణమయ్యే ధాన్యం. ఇవి ఫైబర్ అధికంగా కలిగి ఉండటంతో రోజంతా శక్తిని సమంగా అందిస్తాయి. కొర్రలతో సలాడ్లు, కూరగాయలతో కలిపిన వంటకాలు వేసవిలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే బాజ్రా (సజ్జలు) వేసవిలో తీసుకోవడం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలో వేడి పెంచే గుణం కలిగి ఉండటంతో శీతాకాలంలో తీసుకోవడం ఉత్తమం. వేసవిలో మిల్లెట్లను సరైన విధంగా తీసుకోవడం కూడా ముఖ్యం. వండే ముందు కనీసం 6-8 గంటలు నానబెట్టడం అవసరం. ఇది ఫైటిక్ యాసిడ్‌ను తగ్గించి పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. అలాగే ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా అంబలి వంటి వంటకాలు తయారు చేయడం వల్ల జీర్ణక్రియకు ఉపయోగపడే ప్రోబయోటిక్స్ లభిస్తాయి. మిల్లెట్లలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల వాటిని తీసుకునే సమయంలో తగినంత నీరు తాగడం అత్యవసరం. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం సమస్యలను నివారించవచ్చు. సరైన పరిమాణంలో, సరైన రూపంలో మిల్లెట్లను తీసుకుంటే వేసవి వేడిని తట్టుకోవడం సులభమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.