Grapes | మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, ఊదా వంటి రంగుల్లో లభ్యమవుతాయి. ద్రాక్ష పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ప్రస్తుతం ఇవి కూడా మనకు అని వేళలా అందుబాటులో తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కనుక వీటిని ఎవరైనా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ద్రాక్ష పండ్లల్లో ఉండే పోషకాలు, వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో పోషకాహార వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
ద్రాక్ష పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. దీంతో మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. ద్రాక్ష పండ్లల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. వీటిలో రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండడంతో పాటు కణతుల పెరుగుదలను నిరోధించడంలో కూడా సహాయపడతాయి.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఈ పండ్లు మనకు దోహదపడతాయి. ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ద్రాక్ష పండ్లల్లో విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ద్రాక్షపండ్లను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. అలాగే ద్రాక్ష పండ్లల్లో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వయసు పై బడడం వల్ల వచ్చే అంధత్వాన్ని తగ్గించడంలో ఈ పండ్లు మనకు ఎంతో దోహదపడతాయి.
ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అల్జీమర్స్ వంటి న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ పండ్లు దోహదపడతాయి. అదే విధంగా ద్రాక్ష పండ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఇవి తక్కువగా ప్రభావితం చేస్తాయి. కనుక మధుమేహం ఉన్న వారు వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ద్రాక్ష పండ్లల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఈ పండ్లు మనకు దోహదపడతాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ద్రాక్ష పండ్లు మనకు సహాయపడతాయి. వీటిలో క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ పోషకాలు తోడ్పడతాయి. ఈ విధంగా ద్రాక్ష పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని పోషకాహార వైద్యులు చెబుతున్నారు.