Bachalikura | వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో వేడి చేస్తే ఆ బాధ చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. మూత్రంలో మంట వస్తుంది. ఎండ దెబ్బ తగిలే అవకాశాలు అధికంగా ఉంటాయి. కొందరికి కడుపులో మంటగా కూడా ఉంటుంది. అలాగే డీహైడ్రేషన్ బారిన పడతారు. శరీరంలోని ద్రవాలు త్వరగా బయటకు వెళ్లిపోతాయి. కనుక వేసవిలో చల్లగా ఉండే పానీయాలను లేదా ఆహారాలను తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారాలు మన శరీరానికి చలువ చేయాలి. అలా జరగాలంటే మాంసాహారం, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి. అలాగే మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. ఇక వేసవిలో ఆకు కూరలను తినడం వల్ల కూడా మనకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో బచ్చలికూరను తింటే మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
బచ్చలికూర మనకు చలువ చేస్తుంది. వేసవిలో ఏ ఆకుకూర తినాలా అని చూసే వారికి బచ్చలి కూర మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. బచ్చలికూరను నేరుగా అలాగే కూరలా వండుకుని తినవచ్చు. లేదా జ్యూస్ సేవించవచ్చు. పప్పుతో కలిపి వండుకుని కూడా తినవచ్చు. బచ్చలికూర ఎంతో రుచిగా ఉంటుంది. కనుక ఎవరైనా దీని రుచికి దాసోహం అవ్వాల్సిందే. బచ్చలికూరను తింటే మూత్రం ధారాళంగా వస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మూత్రంలో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. బచ్చలికూరలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్ల సమస్యలు ఉన్నవారు తరచూ బచ్చలికూరను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది.
బచ్చలికూరలో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది చర్మాన్ని రక్షించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాలు రాకుండా మనల్ని రక్షిస్తుంది. ఈ ఆకుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. బచ్చలికూరలో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. బచ్చలికూరలో ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది నీరసం, అలసటను తగ్గించడంతోపాటు రక్తం తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
బచ్చలికూరను తరచూ తింటుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. షుగర్ ఉన్నవారు ఈ ఆకులతో జ్యూస్‌ను తయారు చేసి రోజూ తాగుతుంటే తప్పక ఫలితం ఉంటుంది. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. డిప్రెషన్ ఉన్నవారికి ఈ ఆకులు మేలు చేస్తాయి. తరచూ తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇలా బచ్చలికూరతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా శరీరానికి చలువ చేస్తుంది కనుక వేసవిలో తప్పకుండా తినాలి.