Nutrients | శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బొహైడ్రేట్లు వంటి పోషకాలను పొందడానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే రోజువారీ ఆహారం ద్వారా లభించే పోషకాలపై అవగాహన లేకపోవడంతో చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు. కానీ మనం తీసుకునే సాధారణ ఆహారంలోనే అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు సమృద్ధిగా ఉన్న వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక కీలక విధులు సక్రమంగా కొనసాగుతాయి. పండ్లు, కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. అలాగే చేపల్లో లభించే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందువల్ల ముందుగా రోజువారీ ఆహారం ద్వారా మనకు ఏయే పోషకాలు అందుతున్నాయో తెలుసుకోవడం అవసరం.
విటమిన్ బి12 ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాల్లో లభించే నీటిలో కరిగే విటమిన్. ఎర్ర రక్త కణాలు, డీఎన్ఏ తయారీలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా ఇది అవసరం. విటమిన్ బి12 లోపిస్తే రక్తహీనతతోపాటు జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనా సామర్థ్యానికి సంబంధించిన సమస్యలు వంటి నాడీ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. ఉడికించిన గుడ్డు, ఫోర్టిఫైడ్ సిరియల్స్, పెరుగు, పాలు, సాల్మన్ చేపలు బి12కు మంచి ఆహార వనరులుగా సూచిస్తున్నారు. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంతోపాటు చర్మం, కార్టిలేజ్, రక్తనాళాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. గాయాలు మానడానికి అవసరమైన కొల్లాజెన్ తయారీలో కూడా ఇది కీలకం. మొక్కల ఆధారిత ఆహారాల్లో ఉండే ఇనుమును శరీరం గ్రహించడానికి విటమిన్ సి సహాయపడుతుంది. టమాటాలు, స్ట్రాబెర్రీలు, కివీ, నారింజ, ఎర్ర క్యాప్సికమ్, జామ వంటి వాటిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.
ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి అవసరమైన పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వుల్లో ఒకటి. ఈపీఏ, డీహెచ్ఏ, ఏఎల్ఏ వంటి ఒమెగా-3 రకాలు గుండె, మెదడు ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ఇవి శరీరంలో వాపులను తగ్గించడంలో సహాయపడడంతోపాటు గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. మొక్కల ఆధారిత ఏఎల్ఏ కోసం కనోలా ఆయిల్, అవిసె గింజలు, వాల్నట్స్, చియా గింజలు, అవిసె గింజల నూనె తీసుకోవచ్చు. ఈపీఏ, డీహెచ్ఏ కోసం సాల్మన్, హెర్రింగ్ వంటి చేపలు మంచి వనరులు. పొటాషియం శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటంతోపాటు నాడుల పనితీరు, కండరాల సంకోచాలకు అవసరం. రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత పొటాషియం తీసుకోవడం వల్ల స్ట్రోక్, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. అరటిపండ్లు, సోయాబీన్స్, రాజ్మా, కాల్చిన ఆలుగడ్డలు, ఉడికించిన కందులు, పాలకూర వంటి వాటిలో పొటాషియం లభిస్తుంది.
విటమిన్ ఎ కళ్ల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి, చర్మ ఆరోగ్యానికి ఎంతో అవసరం. కంటి రెటీనా సక్రమంగా పనిచేసేందుకు, ముఖ్యంగా తక్కువ వెలుతురులో చూపు సరిగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. కణాల మధ్య సమాచార మార్పిడి, ప్రజనన ఆరోగ్యంలో కూడా విటమిన్ ఎ పాత్ర ఉంది. ఉడికించిన గుడ్డు, మామిడి, పచ్చి క్యారెట్, ఉడికించిన పాలకూర, చిలగడదుంపలు విటమిన్ ఎ కు మంచి ఆహార వనరులు. విటమిన్ ఇ కూడా శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంతోపాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వయసుతో వచ్చే కొన్ని కంటి సమస్యలను నివారించడంలో కూడా ఇది సహాయపడే అవకాశం ఉంటుంది. మామిడి, కివీ, వేయించిన పల్లీలు, వేయించిన బాదం, పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ లభిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కలిగే కణాల నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడే సమ్మేళనాలు. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్వీర్యం చేయడంలో సహాయపడతాయి. టమాటాలు, పుచ్చకాయ, స్ట్రాబెర్రీలు, క్యారెట్లు, గుమ్మడికాయ, నారింజ, పాలకూర, బ్రోకలీ, ఉసిరి, బెర్రీలు, నేరేడు పండ్లు, పర్పుల్ క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు వంటి ఆహారాల్లో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఒకే రకమైన ఆహారంపై ఆధారపడకుండా వివిధ రకాల పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను రోజువారీ మెనూలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆహారం ద్వారా ఇప్పటికే లభిస్తున్న పోషకాలను తెలుసుకోవడం ద్వారా అవసరం లేని సప్లిమెంట్ల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. అయితే నిర్దిష్ట పోషక లోపం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలితే లేదా వైద్యుడు సూచిస్తే సప్లిమెంట్లు తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.