Chapati | మన తీసుకునే ఆహారాల్లో చపాతీలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చెప్పవచ్చు. గోధుమలతో చేసే ఈ చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. భారతీయుల వంటకాల్లో ఇవి ఎంతో ముఖ్యమైనవని చెప్పవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో ఇలా వివిధ రకాలుగా చపాతీలు మనకు సహాయపడతాయి. అయితే బరువు తగ్గడానికి తరచూ గోధుమలతో చేసే చపాతీలే కాకుండా మనం ఇతర ధాన్యాలతో చేసిన చపాతీలను కూడా ఆహారంగా తినవచ్చు. గోధుమ చపాతీలకు ప్రత్యామ్నాయంగా మనం వీటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడానికి గోధుమ చపాతీలకు బదులుగా తీసుకోదగిన ఇతర ప్రత్యామ్నాయాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
ఓట్స్ గ్లూటెన్ రహిత ధాన్యం. వీటిలో విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడంలో ఓట్స్ చపాతీ మనకు ఎంతగానో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కొలెస్ట్రాల్ తో బాధపడే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఒక కప్పు ఓట్స్ ను మెత్తని పిండిగా చేసుకుని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత ఈ పిండితో చపాతీలు చేసుకోవాలి. ఇలా ఓట్స్ తో చపాతీ చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గడానికి రాగి చపాతీలు చక్కగా పని చేస్తాయని చెప్పవచ్చు. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. రాగి చపాతీలను తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రాగి చపాతీలను చేసుకోవడానికి ఒక కప్పు రాగిపిండిలో గోరు వెచ్చని నీటిని వేసి కలపాలి. తరువాత పిండిని ముద్దలుగా చేసుకుని చపాతీలు చేసుకోవాలి. రాగి చపాతీలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.
బార్లీతో చపాతీ చేసి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా బార్లీ చపాతీ మనకు సహాయపడుతుంది. ఈ చపాతీని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో బార్లీ పిండిని తీసుకుని గోరు వెచ్చని నీళ్లు పోసి కలపాలి. తరువాత ఈ పిండిని ముద్దలుగా చేసి చపాతీలు చేసుకోవాలి. నల్ల శనగలతో కూడా చపాతీలు తయారు చేసి తీసుకోవచ్చు. నల్ల శనగలతో చేసే చపాతీలను తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. శరీరానికి కావల్సిన ప్రోటీన్ అందుతుంది. దీని కోసం శనగలను పిండిగా చేసి అందులో నీరు లేదా పాలు లేదా పెరుగు వేసి కలిపి చపాతీలను తయారు చేసి తీసుకోవచ్చు. గోధుమలతో చేసే చపాతీల కంటే వీటిని తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
సాధారణంగా జొన్న రొట్టెలను కూడా చాలా మంది తింటూ ఉంటారు. జొన్న రొట్టెలను తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. జొన్నపిండిలో గోరు వెచ్చని నీటిని వేసి బాగా కలపాలి. తరువాత చపాతీ చేసి మీడియం మంటపై బాగా కాల్చుకోవాలి. జొన్న రొట్టెలను తీసుకోవడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. బాదంపిండి కూడా మార్కెట్ లో సులభంగా లభిస్తుంది. దీనిని తగిన మోతాదులో తీసుకుని చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత చపాతీ చేసి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తరచూ గోధుమలతో చేసే చపాతీలనే కాకుండా ఇలా ఆయా ధాన్యాలతో కూడా చపాతీలను చేసి తినవచ్చు. ఈ చపాతీలను తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు లభించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.