Walking Or Jogging | మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరికి నచ్చిన వ్యాయామాన్ని వారు చేస్తుంటారు. పోషకాహార నిపుణులు, వైద్యులు సైతం రోజూ వ్యాయామం కచ్చితంగా చేయాలని చెబుతుంటారు. రోజూ ఎంతో కొంత శారీరక శ్రమ ఉంటేనే మనం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటాం. వ్యాయామం కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాక మానసిక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. వారంలో కనీసం 5 రోజులు రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని డైటిషియన్లు చెబుతుంటారు. అయితే ఎక్కువ శాతం మంది చేసే వ్యాయామాల్లో వాకింగ్ కూడా ఒకటి. ఇందుకు పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. అన్ని వయస్సుల వారు చేయదగిన చాలా సులభతరమైన వ్యాయామం వాకింగ్.
అయితే ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయాలా.. జాగింగ్ చేయాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. జాగింగ్ అంటే కాస్త వేగంగా వాకింగ్ చేయడం. రన్నింగ్ కన్నా కాస్త తక్కువ స్పీడ్‌తో పరుగెత్తడం అన్నమాట. అయితే వాకింగ్, జాగింగ్.. రెండింట్లో ఏది మంచిది.. అనే విషయానికి వస్తే.. రెండూ మంచి వ్యాయామాలే అని చెప్పవచ్చు. కానీ వాకింగ్ కన్నా జాగింగ్ చేస్తేనే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీంతో బరువు త్వరగా తగ్గుతారు. గుండెకు చక్కని వ్యాయామం అవుతుంది. కనుక ఓపిక ఉన్నవారు జాగింగ్ చేస్తేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా వాకింగ్ చేస్తే 30 నిమిషాలకు 100కు పైగా క్యాలరీలు ఖర్చు అవుతాయి. కానీ జాగింగ్ చేస్తే 30 నిమిషాలకు 200 కు పైగా క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. అయితే మీరు 100 క్యాలరీలను కరిగించే ప్రణాళికలో ఉంటే 30 నిమిషాల వాకింగ్‌కు బదులుగా 15 నిమిషాల జాగింగ్ చేస్తే చాలు అన్నమాట.
సాధారణంగా టైమ్ లేదని భావించేవారు రోజుకు కనీసం 15 నిమిషాల పాటు అయినా సరే జాగింగ్ చేస్తే చాలన్నమాట. దీంతో 100 క్యాలరీలను కరిగించవచ్చు. ఇలా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. కనుక సమయం లేదని భావించేవారు, ఫిట్‌గా ఉండాలనుకునేవారు 15 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే చాలు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు జాగింగ్ చేయకపోవడమే మంచిది. వీరు 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేయాలి. ఇక మిగిలిన ఎవరు అయినా సరే జాగింగ్ చేస్తేనే ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. దీని వల్ల బరువు త్వరగా తగ్గుతారు. అలాగే గుండెకు చక్కని వ్యాయామం జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ వంటివి రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
అయితే వాకింగ్ లేదా జాగింగ్ ఏది చేసినా ఎవరి సౌకర్యానికి తగినట్లు వారు చేయవచ్చు. ఓపిక ఉందనుకుంటే జాగింగ్ చేయాలి. లేదనుకుంటే కనీసం వాకింగ్ అయినా చేయాలి. ఇలా రెండింట్లో ఏది చేసినా మనకు ఆరోగ్య ప్రయోజనాలే కలుగుతాయి. రెండింటి వల్ల చక్కని శారీరక శ్రమ చేయవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రెండింటి వల్ల షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గడమే కాదు, అధిక బరువును తగ్గించుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. కండరాలు నిర్మాణమవుతాయి. కీళ్లు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా ఎన్నో విధాలుగా మనకు ఈ రెండూ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక ఎవరి సౌకర్యానికి తగినట్లు వారు ఏదో ఒకటి చేస్తుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.