రోజువారీ నడక, ఇంటి పనులు లాంటి తేలికపాటి కార్యకలాపాలు కూడా శరీరానికి మంచి వ్యాయామంగా పరిగణించవచ్చని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఈ సాధారణ పనులే క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయని అధ్యయనకారులు వెల్లడించారు. భారీ కసరత్తుల కన్నా రోజూ వేసే అడుగుల సంఖ్య, చురుకుగా ఉండటమే క్యాన్సర్ నివారణలో చాలా కీలకమని ఈ పరిశోధన స్పష్టం చేసింది. కఠినమైన వ్యాయామాలు చేయకపోయినా, రోజువారీ సాధారణ కదలికలు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నది.
ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ నిర్వహించిన ఈ అధ్యయనంలో రోజుకు 5,000 అడుగులు నడిచే వారితో పోలిస్తే 7,000 అడుగులు నడిచే వారిలో క్యాన్సర్ ప్రమాదం 11% తగ్గిందని తేలింది. 9,000 అడుగులు నడిచే వారిలో ఈ ప్రమాదం 16% వరకు తగ్గిందట. ‘సాధారణ నడక, ఇంటి పనులు, తేలికపాటి వ్యాయామాలు లాంటివి చేస్తూ రోజూ చురుకుగా ఉండటమే ముఖ్యం’ అని పరిశోధకులు పేర్కొన్నారు. కాబట్టి, రోజూ చురుకుగా ఉండండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి. నడకను దినచర్యలో భాగం చేసుకోండి!