10000 Steps Daily | ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రస్తుతం చాలా మంది వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ అనేది చాలా తేలికైన వ్యాయామం. దీన్ని చేసేందుకు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఏ వయస్సులో ఉన్నవారైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అయితే రోజుకు ఎంత దూరం నడవాలి అన్న విషయంలోనే చాలా మంది సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. ఇందుకు ఫిట్ నెస్ నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే.. రోజుకు కనీసం 10వేల అడుగుల దూరం నడిస్తే ఎంతో మంచిదని అంటున్నారు. దీని వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఎంత దూరం నడిచింది లెక్కించాలంటే అందుకు ఫోన్లలో ఉండే పెడోమీటర్ యాప్ లేదా స్మార్ట్ వాచ్, స్మార్ట్ బ్యాండ్ వంటివి ఎంతో ఉపయోగపడతాయి. వాటిని ఉపయోగించి మనం ఎన్ని అడుగుల దూరం నడిచింది ఇట్టే తెలుసుకోవచ్చు. ఇక రోజుకు 10వేల అడుగుల దూరం నడిస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ 10వేల అడుగుల దూరం నడిస్తే గుండెకు చక్కని వ్యాయామం అవుతుంది. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. 10వేల అడుగుల దూరం నడవడం వల్ల శరీరం క్యాలరీలను అధికంగా ఖర్చు చేస్తుంది. కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. చక్కని దేహాకృతి సొంతమవుతుంది. కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. శరీర మెటబాలిజం పెరుగుతుంది. మీరు నిద్రిస్తున్నప్పటికీ శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తూనే ఉంటుంది. దీని వల్ల బరువు త్వరగా తగ్గుతారు. వాకింగ్ చేయడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. కీళ్లలో గుజ్జు పెరుగుతుంది. కీళ్ల నొప్పులు రాకుండా చూసుకోవచ్చు.
రోజూ 10వేల అడుగుల దూరం నడవడం వల్ల ఇన్సులిన్‌ను శరీరం మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. షుగర్ ఉన్నవారికి ఈ వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. శారీరకంగా దృఢంగా మారుతారు. వాకింగ్‌ను ఇలా చేయడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీర కణాలకు ఆక్సిజన్ మెరుగ్గా సరఫరా అవుతుంది. దీని వల్ల అప్రమత్తంగా ఉంటారు. నీరసం, అలసట రావు. వాకింగ్ చేయడం వల్ల శరీరానికి చక్కని వ్యాయామం అవుతుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది.
వాకింగ్ చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మూడ్‌ను సహజసిద్ధంగా మారుస్తాయి. వీటి వల్ల ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా వాకింగ్ చేయడం వల్ల మెదడుకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. అయితే రోజుకు 10వేల అడుగుల దూరం నడవడం ప్రారంభంలో కాస్త కష్టంగానే ఉంటుంది. కనుక ముందుగా తక్కువ సంఖ్యలో మొదలు పెట్టాలి. రోజుకు 2వేలు, 3వేల అడుగులు అలా నడుస్తూ క్రమంగా పెంచాలి. దీంతో మీకు రోజూ 10వేల అడుగుల దూరం నడవడం చాలా తేలికవుతుంది. ఇలా వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలను పొందగలుగుతారు.