సాధారణంగానే మహిళల్లో పోషకాహర లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అది ఎప్పుడూ వివిధరకాల సమస్యలకు కారణమవుతూనే ఉంటుంది. పోషకాల్లో ఒక్కో విటమిన్ ఒక్కో అవయవానికి మేలు చేస్తుంది. అందువల్ల అన్ని పోషకాలు మనిషికి అవసరమే. దాంట్లో విటమిన్-డి అనేది ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
విటమిన్-డి లోపిస్తే ఎముకలు బలహీనపడి ‘ఆస్టియోమలాషియా’ సమస్య వస్తుంది. అంతేకాదు, ఇది ఇలాగే కొనసాగితే దీర్ఘకాలంలో ఆస్టియోపొరోసిస్ సమస్యకు దారితీసి.. ఎముకలు గుల్లబారుతాయి. చిన్న గాయం కావడంతోనే విరిగిపోతుంటాయి. ఈ సమస్యలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, విటమిన్-డి లోపం వల్ల మహిళల్లో తీవ్రమైన సమస్యలు వస్తాయట.
నడి వయసు దాటిన మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఎముకలు పటుత్వం కోల్పోతూ ఉంటాయి. ఇదే కాకుండా జీవనశైలిలో మార్పుల వల్ల కూడా మహిళల్లో విటమిన్-డి లోపిస్తుంది. ఫలితంగా అలసట, కండరాల బలహీనత, ఎముకల్లో నొప్పి (ముఖ్యంగా నడుము, కాళ్లు), డిప్రెషన్, రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జలుబు, జ్వరం రావడం, జుట్టు రాలడం, గాయాలు త్వరగా తగ్గకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
విటమిన్-డి లోపించకూడదు అంటే.. ప్రతిరోజూ ఉదయం కొంతసేపు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. రోజూ కాకపోయినా రెండు రోజులకు ఒకసారి 15-30 నిమిషాలు సూర్యోదయం వేళ ఎండలో కూర్చుంటే మంచిది. అలాగే తినే ఆహారంలో విటమిన్-డి ఉండే ఫ్యాటీ ఫిష్ (సాల్మన్), గుడ్డు పచ్చసొన, ఫోర్టిఫైడ్ పాలు, పప్పు ధాన్యాలు తీసుకోవాలి. యూవీ కిరణాలు పడేచోట సాగు చేసిన పుట్టగొడుగుల్లో కూడా విటమిన్-డి ఉంటుంది. వీటితో పాటు 50 ఏళ్లు దాటిన మహిళలు వైద్యులను సంప్రదించి విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. వీటితో పాటు క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం తీసుకుంటూ, బరువులతో కూడిన వ్యాయామం చేయడం ద్వారా విటమిన్-డి లోపాన్ని ఎదుర్కోవచ్చు.