Vitamin D For Pregnant Women | గర్భం ధరించిన మహిళలు తినే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే. అన్ని పోషకాలు ఉండే ఆహారాలను వారు రోజూ తీసుకుంటేనే గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టుకతో ఎలాంటి లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ప్రస్తుతం చాలా మంది గర్భిణీలు తమకు తెలియకుండానే పోషకాహార లోపంతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. స్త్రీలు సాధారణ సమయంలో కన్నా గర్భం దాల్చినప్పుడు రోజూ కాస్త ఎక్కువ ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అలాగే నీళ్లను కూడా కాస్త ఎక్కువగానే తాగాలి. దీని వల్ల శిశువుకు అన్ని పోషకాలు అంది ఆరోగ్యంగా జన్మించేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక గర్భిణీలు అన్ని పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకున్నట్లే విటమిన్ డి ఉండే ఆహారాలను కూడా రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది గర్భిణీలు విటమిన్ డి ఆహారాన్ని సరిగ్గా తినడం లేదు. దీని కారణంగా శిశువులకు అనేక వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీలు సరైన పౌష్టికాహారం తినకపోతే దాని ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతుంది. గర్భిణీలు చాలా మందిలో విటమిన్ డి లోపం సమస్య ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల పిల్లలు పుట్టిన తరువాత అనేక సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. గర్భిణీల్లో విటమిన్ డి లోపం ఉండడం వల్ల శిశువులు మరీ అధిక బరువుతో జన్మిస్తున్నారని, వారు స్థూలకాయం బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాగే అలాంటి చిన్నారులకు 6 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత నడుం చుట్టు కొలత విపరీతంగా పెరిగి ఊబకాయులుగా మారుతున్నారని హెచ్చరిస్తున్నారు. గర్భిణీల్లో విటమిన్ డి లోపం ఉంటే దాని ప్రభావం పుట్టబోయే శిశువుపై తీవ్రంగా పడుతుందని అంటున్నారు. అలాంటి చిన్నారుల్లో అనేక సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.
విటమిన్ డి లోపం గర్భిణీల్లో ఉంటే పుట్టబోయే శిశువులకు గుండె జబ్బులు, మల్టిపుల్ స్లెరోసిస్ వంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అలాగే అలాంటి చిన్నారుల్లో క్యాన్సర్, టైప్ 1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం చాలా మంది మహిళల్లో విటమిన్ డి లోపం ఉంటోంది. వారు గర్భం దాల్చిన తరువాత కూడా ఆ లోపం అలాగే కొనసాగుతుందని, అది తెలియకపోవడం వల్ల చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారని అంటున్నారు. విటమిన్ డి లోపం మహిళల్లో ఉంటే వెంటనే డాక్టర్ను కలిసి చికిత్స తీసుకోవాలని అంటున్నారు. అయితే విటమిన్ డి లోపం ఉన్నవారు ఆ విటమిన్ను చాలా సులభంగా పొందవచ్చు. రోజూ కాసేపు సూర్య రశ్మి తగిలేలా ఉదయం పూట ఎండలో నిలుచుంటే చాలు, విటమిన్ డిని శరీరం దానంతట అదే తయారు చేసుకుంటుంది. అలాగే కోడిగుడ్లు, చేపలు, పాలు, చీజ్, పెరుగు వంటి ఆహారాలను తీసుకుంటున్నా కూడా విటమిన్ డి లభిస్తుంది.
మన దేశంలో సుమారుగా 66 శాతం మంది మహిళలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని అధ్యయనాల్లో తేలింది. గర్భిణీలకు 3వ నెల తరువాత ఈ సమస్య ఎక్కువగా వస్తుందని గుర్తించారు. కనుక గర్భిణీలే కాదు, గర్భం దాల్చని మహిళలు కూడా విటమిన్ డి ఉన్న ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్లు సూచించిన మేర విటమిన్ డి ట్యాబ్లెట్లను కూడా వాడవచ్చు. దీని వల్ల మహిళలు విటమిన్ డి లోపం నుంచి బయట పడవచ్చు. అలాగే శిశువుల్లో పుట్టుక లోపాలు, వ్యాధులు రాకుండా కాపాడవచ్చు.