చలికాలంలో మెత్తబడిపోయిన మన ఎముకలు, కండరాలకు బలాన్ని ఇవ్వడం కోసం విటమిన్ డి అవసరం. మిగతా రోజుల కన్నా.. చలికాలంలో విటమిన్ డి లోపం అధికంగా ఉంటుందని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ లోపాన్ని అధిగమించే ముఖ్యమైన ఆహార పదార్థాలను వివరిస్తున్నారు. చలికాలంలో చేపలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్ పుష్కలంగా అందుతాయి. అందులోని విటమిన్ డి మన కండరాలను బలంగా మార్చడంలో సాయపడుతుంది. అన్ని చేపలు కాకుండా సాల్మన్ ఫిష్, ట్యూనా, సార్టినెస్ చేపలను తినడం మంచిది.
ఇక మనం నిత్యం తినే కోడిగుడ్లలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే మంచిది. శాకాహారులైతే రోజుకొక నారింజ పండును తినడం వల్ల అందులోని విటమిన్ సి తోపాటు విటమిన్ డి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుట్టగొడుగుల్లో విటమిన్ బితో పాటు విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటిని కూడా డైట్లో చేర్చుకుంటే మంచిది. చీజ్‌ను కూడా వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. ఈ చలికాలంలో వీటిని తింటూ విటమిన్ డి లోపాన్ని హాయిగా ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.