Vitamin C | మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాల్లో విటమిన్ సి ఒకటి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో, శరీరం ఐరన్ ను గ్రహించడంలో విటమిన్ సి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక నారింజ, కివి పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. శరీరానికి కావల్సిన విటమిన్ సి ను అందించడంలో ఇవి రెండు కూడా సరైన ఎంపికలు అని చెప్పవచ్చు. అయితే వీటిలో దేనిని తీసుకోవడం వల్ల మనకు విటమిన్ సి ఎక్కువగా అందుతుంది.. విటమిన్ సి స్థాయిలను పెంచడానికి ఏ పండును తీసుకోవడం సరైనది.. అన్న సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. విటమిన్ సి కంటెంట్ ఏ పండులో ఎక్కువగా ఉంటుంది.. ఏ పండును తీసుకోవడం వల్ల విటమిన్ సి స్థాయిలు వేగంగా పెరుగుతాయి.. దీని గురించి వైద్యులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ పండులో కంటే కివిలోనే విటమిన్ సి దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల నారింజ పండులో 53 మిల్లీ గ్రాముల విటమిన్ సి, కివి లలో 92 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఒక మీడియం సైజులో ఉండే కివి పండును తీసుకుంటే చాలు ఒక రోజుకు మన శరీరానికి కావల్సిన విటమిన్ సి అందుతుంది. అలాగే ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రెండు పండ్లు కూడా తెల్ల రక్తకణాల పనితీరును పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అయితే విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల కివి పండ్లను తీసుకోవడం వల్ల ఫ్లూ సీజన్ లో వేగవంతమైన రోగనిరోధక శక్తి శరీరానికి అందుతుంది. అదేవిధంగా చర్మ ఆరోగ్యం, కొల్లాజెన్ ఉత్పత్తిలో కూడా ఈ రెండు పండ్లు దోహదకరంగా ఉంటాయి.
కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే కివి పండ్లను తీసుకోవడం వల్ల చర్మ మరమ్మత్తు, స్థితిస్థాపకతకు మద్దతు ఇస్తుంది. నారింజ పండు చర్మం కాంతివంతంగా మారడానికి, సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. చర్మ సంరక్షణలో ఇవి రెండు కూడా ప్రత్యేక ప్రయోజనాలను అందించినప్పటికీ కివి పండ్లు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక జీర్ణక్రియ, పొట్ట ఆరోగ్యానికి ఇవి రెండు కూడా మద్దతును ఇస్తాయి. కివిలో ఆక్టినిడిన్ అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నారింజ పండులో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉటుంది. ఇది పేగు కదలికలకు, మొత్తం జీర్ణక్రియకు మద్దతును ఇస్తుంది. అలాగే క్యాలరీల విషయానికి వస్తే నారింజలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కివిలో చక్కెర కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి నారింజ పండు మేలు చేసినప్పటికీ కివి పండును తీసుకుంటేనే అధిక పోషకాలు లభిస్తాయి.
నారింజ పండ్లు సులభంగా లభిస్తాయి, తక్కువ ధరలో లభిస్తాయి. ప్రయాణ సమయంలో కూడా ఇవి అనుకూలంగా ఉంటాయి. రోజువారి విటమిన్ సి అవసరాలకు ఇవి అనుకూలమైనవి. కివి పండ్లు ఖరీదుతో కూడుకున్నవి. అయినప్పటికీ వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. త్వరగా, శక్తివంతంగా విటమిన్ సి స్థాయిలను పెంచుకోవాలనుకునే వారు కివి పండ్లను తీసుకోవడం మంచిది. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడంతో పాటు బరువు తగ్గాలనుకునే వారు నారింజ పండును తీసుకోవడం మంచిది. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు పండ్లను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల సమతుల్య పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.