Vitamin C Fruits | నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే చాలా మంది ఈ పండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. విటమిన్ సి మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీంతో శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. కణాలు రక్షించబడతాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. విటమిన్ సి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుడుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా అనేక విధాలుగా విటమిన్ సి మనకు ఉపయోగపడుతుంది. అయితే కేవలం నారింజ పండ్లే కాదు.. పలు రకాల ఇతర ఆహారాల్లోనూ మనకు విటమిన్ సి లభిస్తుంది. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ పండ్లలోనూ విటమిన్ సి సమృద్ధిగానే ఉంటుంది. మనకు ఈ పండ్లు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఇవి ధర కూడా తక్కువగానే ఉంటాయి. పైనాపిల్ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండ్లను తింటే విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఒక కప్పు పైనాపిల్ పండ్లను తినడం వల్ల సుమారుగా 80 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి ని పొందవచ్చు. ఇది మనకు తాజాదనాన్ని అందిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. అలాగే లిచి పండ్లను తిన్నా కూడా విటమిన్ సి సమృద్ధిగానే లభిస్తుంది. ఈ పండ్లు మనకు మార్కెట్లో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. కాస్త ధర ఎక్కువ ఉంటాయి. అయితే ఈ పండ్లలో ఉండే పోషకాలు మాత్రం అమోఘం అనే చెప్పాలి. ఈ పండ్లను ఒక కప్పు తింటే చాలు మనకు సుమారుగా 135 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. ఈ పండ్లు తియ్యగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నేరేడు పండ్లలోనూ మనకు విటమిన్ సి అధికంగానే లభిస్తుంది. ఈ పండ్లు ఇప్పుడు లభించవు. కానీ ఈ పండ్లకు చెందిన జ్యూస్ మనకు మార్కెట్లో లభిస్తుంది. దాన్ని తాగవచ్చు. ఇక ఒక కప్పు నేరేడు పండ్లను తింటే సుమారుగా 80 నుంచి 90 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. ఈ పండ్ల విత్తనాలను పొడి చేసి తీసుకుంటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి నేరేడు పండ్ల జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. దీంతో షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే బొప్పాయి పండ్లలోనూ విటమిన్ సి అధికంగానే ఉంటుంది. ఒక కప్పు బొప్పాయి పండ్ల ముక్కలను తింటే సుమారుగా 95 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. బొప్పాయి పండ్లను నేరుగా తినవచ్చు. లేదా స్మూతీలు, సలాడ్స్ రూపంలోనూ తీసుకోవచ్చు.
స్ట్రాబెర్రీల ద్వారా కూడా విటమిన్ సి ని సమృద్ధిగా పొందవచ్చు. ఈ పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. ధర ఎక్కువగానే ఉంటుంది. కానీ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు స్ట్రాబెర్రీలను తింటే సుమారుగా 90 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి ని పొందవచ్చు. అదేవిధంగా కివి పండ్లలోనూ విటమిన్ సి సమృద్ధిగానే ఉంటుంది. ఒక కప్పు కివి పండ్లను తింటే సుమారుగా 70 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి ని పొందవచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం త్వరగా తగ్గేలా చేస్తుంది. శరీరంలో ప్లేట్లెట్లను పెంచుతుంది. కనుకనే డెంగ్యూ వచ్చిన వారికి ఈ పండ్లను ఇస్తుంటారు. ఇలా పలు రకాల పండ్లను తినడం వల్ల విటమిన్ సి ని సమృద్ధిగా పొందవచ్చు.