Vitamin B12 Deficiency | మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ బి12 కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక విధులను నిర్వహిస్తుంది. ఎర్ర రక్త కణాల తయారీకి, నాడీ మండల వ్యవస్థకు, శరీరంలో శక్తి స్థాయిలకు మనకు విటమిన్ బి12 అవసరం అవుతుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విటమిన్ బి12 లోపం బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. 2023లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం యుక్త వయస్సులో ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. విటమిన్ బి12 లోపిస్తే మన శరీరం మనకు పలు లక్షణాలు తెలియజేస్తుంది. తీవ్రమైన అలసట, నాడుల సమస్యలు, మెడ, భుజాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే విటమిన్ బి12 లోపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి. డాక్టర్లు విటమిన్ బి12 సప్లిమెంట్లను ఇస్తారు. వీటిని వాడడంతోపాటు ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకుంటే మనం ఈ లోపం నుంచి సులభంగా బయట పడవచ్చు.
విటమిన్ బి12 లోపం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. శాకాహారుల్లో విటమిన్ బి12 లోపం వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఇటీవలే కొందరు సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. సుమారుగా 50 శాతం మంది శాకాహారుల్లో విటమిన్ బి12 లోపం వచ్చే చాన్స్ ఉంటుందని వారు అంటున్నారు. ఎందుకంటే విటమిన్ బి12 ముఖ్యంగా మనకు మటన్, కోడిగుడ్లు, పాల ఉత్పత్తుల ద్వారా లభిస్తుంది. అయితే ఈ ఆహారాలను కొందరు శాకాహారులు తీసుకోరు. ఫలితంగా విటమిన్ బి12 లోపం ఏర్పడుతుంది. కనుక మాంసాహారుల కంటే శాకాహారుల్లోనే ఈ విటమిన్ లోపం ఏర్పడే అవకాశం ఎక్కువని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇక గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్నవారిలోనూ విటమిన్ బి12 లోపం వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే మనం తినే ఆహారంలో ఉండే విటమిన్ బి12ను శరీరం సరిగ్గా శోషించుకోదు. గ్యాస్ ట్రబుల్ ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కనుక విటమిన్ బి12 లోపించేందుకు గ్యాస్ ట్రబుల్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. గ్యాస్ ట్రబుల్ సమస్య దీర్ఘకాలికంగా ఉన్నవారు కచ్చితంగా విటమిన్ బి12 లోపం ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. విటమిన్ బి12 లోపం ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. విటమిన్ బి12 ఉండే ఆహారాలను తినాలి.
వయస్సు మీద పడడం వల్ల కూడా విటమిన్ బి12 లోపం వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. వయస్సు మీద పడడం వల్ల శరీరం మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను సరిగ్గా శోషించుకోలేదు. దీని వల్ల విటమిన్ల లోపం ఏర్పడుతుంది. కనుక వయస్సు పైబడుతున్నవారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని రకల మందులను వాడే వారిలోనూ విటమిన్ బి12 లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్, గ్యాస్ ట్రబుల్ సమస్యలకు గాను మందులను వాడేవారిలో విటమిన్ బి12 లోపం వస్తుందని చెబుతున్నారు. ఆటో ఇమ్యూన్ వ్యాధుల కారణంగా కూడా విటమిన్ బి12 లోపం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. విటమిన్ బి12 లోపిస్తే తీవ్రమైన నీరసం ఉంటుంది. చిన్న పనిచేసినా అలసిపోతారు. చేతులు, కాళ్లలో స్పర్శ లేనట్లు అనిపిస్తుంది లేదా ఆయా భాగాల్లో సూదుల్తో గుచ్చినట్లు అనిపిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. ఏ పని మీద దృష్టి సారించలేరు. కామెర్లు, నాలుక వాపు వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి.
కనుక విటమిన్ బి12 లోపం ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలిసి చికిత్స తీసుకోవాలి. వారు విటమిన్ బి12 సప్లిమెంట్లను ఇస్తారు. వాటిని వాడుకోవాలి. అలాగే ఆహారంలో భాగంగా చికెన్, మటన్, మటన్ లివర్, చేపలు, గుడ్లు వంటి వాటిని తీసుకుంటే విటమిన్ బి12 పొందవచ్చు. శాకాహారులు పాలు, చీజ్, పెరుగు వంటి వాటిని తీసుకుంటే ఈ లోపం నుంచి బయట పడవచ్చు. అలాగే తృణ ధాన్యాలు, పుట్టగొడుగుల్లోనూ విటమిన్ బి12 లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకున్నా కూడా ఈ లోపం నుంచి బయట పడవచ్చు.