Vitamin A | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు మనకు అవసరం అవుతాయి. వాటిల్లో విటమిన్ ఎ కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. అలాగే కంటి చూపును మెరుగు పరిచి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరుకు కూడా ఉపయోగపడుతుంది. అయితే సాధారణంగా విటమిన్ ఎ లోపం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గతంలో విటమిన్ ఎ లోపం అధికంగా వచ్చేది. కానీ అవగాహన పెరగడంతో ప్రజలు పౌష్టికాహారం తీసుకుంటున్నారు. విటమిన్ ఎ లోపం రాకుండా జాగ్రత్త వహిస్తున్నారు. కానీ కొందరిలో ఈ లోపం పలు అనుకోని కారణాల వల్ల ఏర్పడుతోంది. విటమిన్ ఎ లోపం ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నారుల్లో అధికంగా వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. సిస్టిక్ ఫైబ్రోసిస్, క్రానిక్ డయేరియా వంటి వ్యాధులు ఉన్నవారికి కూడా విటమిన్ ఎ లోపం సంభవిస్తుంది.
విటమిన్ ఎ లోపం ఉంటే మన శరీరం మనకు పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. విటమిన్ ఎ లోపం వల్ల చర్మ కణాలు కొత్తగా ఏర్పడడం తగ్గుతుంది. దీంతో చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మం ఎల్లప్పుడూ పొడిగా మారి నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే ఎగ్జిమా, దురద, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు కూడా తరచూ వస్తుంటాయి. విటమిన్ ఎ లోపం ఉన్నవారిలో కంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. ముఖ్యంగా కళ్లలో నీరు తగ్గిపోతుంది. దీంతో కళ్లు పొడిగా మారి దురదలు పెడతాయి. దీర్ఘకాలంలో ఇది అంధత్వానికి దారి తీసే ప్రమాదం కూడా ఉంటుంది. విటమిన్ ఎ లోపం మరీ అధికంగా ఉంటే రేచీకటి సమస్య వస్తుంది. రాత్రి పూట చూపు మందగిస్తుంది. విటమిన్ ఎ లోపించిందని చెప్పేందుకు దీన్ని ప్రధాన కారణంగా భావించవచ్చు. అలాగే విటమిన్ ఎ లోపం ఉన్న స్త్రీ, పురుషుల్లో సంతానం కలగరు. ప్రత్యుత్పత్తి అవయవాల పనితీరు సరిగ్గా ఉండదు. కనుక సంతాన లోపం సమస్య ఉంటుంది. పిల్లల్లో ఎదుగుదల లోపం ఉండడం, తరచూ గొంతు లేదా ఛాతి ఇన్ఫెక్షన్లు వస్తుండడం, గాయాలు ఆలస్యంగా మానడం, మొటిమలు తరచూ అధికంగా వస్తుండడం వంటివి కూడా విటమిన్ ఎ లోపం ఉందని తెలియజేసే లక్షణాలుగా అర్థం చేసుకోవాలి.
విటమిన్ ఎ వయస్సును బట్టి రోజుకు నిర్దిష్టమైన మోతాదులో అవసరం అవుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 6 నెలల వయస్సు ఉన్నవారికి రోజుకు 400 మైక్రోగ్రాముల విటమిన్ ఎ అవసరం. 7 నుంచి 12 నెలలు ఉన్నవారికి 500 మైక్రోగ్రాములు, 1 నుంచి 3 ఏళ్ల వారికి 300 మైక్రోగ్రాములు, 4 నుంచి 8 ఏళ్ల వారికి 400 మైక్రోగ్రాములు, 9 నుంచి 13 ఏళ్ల వారికి 600 మైక్రోగ్రాములు, 14 నుంచి 18 ఏళ్ల వారికి (బాలురు అయితే) 900 మైక్రోగ్రాములు, 14 నుంచి 18 ఏళ్ల వారికి (బాలికలు అయితే) 700 మైక్రోగ్రాములు, పురుషులకు 900 మైక్రోగ్రాములు, స్త్రీలకు 700 మైక్రోగ్రాములు, గర్భిణీలకు 770 మైక్రోగ్రాములు, పాలిచ్చే తల్లులకు రోజుకు 1300 మైక్రోగ్రాముల విటమిన్ ఎ అవసరం అవుతుంది. విటమిన్ ఎ మనకు పలు ఆహారాల్లో లభిస్తుంది.
పాలకూర, బ్రొకొలి, గ్రేప్ ఫ్రూట్, మిరపకాయలు, చీజ్, యాప్రికాట్స్, పిస్తాపప్పు, యాపిల్స్, క్యారెట్లు, కోడిగుడ్లు, అవకాడో, బొప్పాయి, చిలగడదుంపలు, చేపలు తదితర ఆహారాల్లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ ఎ ఉండే ఆహారాలను రోజూ తీసుకుంటే ఈ లోపం నుంచి బయట పడవచ్చు. అలాగే విటమిన్ ఎ లోపం ఉన్నవారు డాక్టర్లు ఇచ్చే మందులను కూడా క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. విటమిన్ ఎ ట్యాబ్లెట్లను కేవలం డాక్టర్లు సూచించిన కాల పరిమితి వరకు మాత్రమే వాడాలి. వీటిని అధికంగా వాడితే దుష్పరిణామాలు ఎదురవుతాయి. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ ఆయా ఆహారాలను తీసుకుంటుంటే విటమిన్ ఎ లోపం నుంచి సులభంగా బయట పడవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా ఉంటాయి.