చర్మం, కళ్లలోని తెల్లని భాగం పచ్చరంగుకు మారట మనేది కామెర్ల వ్యాధి (జాండిస్)కి అందరికీ తెలిసిన ఒక కొండ గుర్తు…! రక్తంలో బైల్‌రూబిన్ అధికంగా చేరటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పసుపు రంగులో ఉండే ఓ వ్యర్థ పదార్థం. ఎర్ర రక్తకణాలలోని హిమోగ్లోబిన్ తొలిగిపోయాక మిగిలిన భాగం ఇది. బైల్‌రూబిన్ పరిమాణం ఎక్కువ అయినపుడు అది చుట్టుపక్కల కణజాలాల్లోకి చేరి వాటికి పసుపు రంగు కలిగిస్తుంది. సాధారణంగా రక్తంలోని బైల్ రూబిన్ని కాలేయం తొలగించి వేస్తుంటుంది. అది కాలేయానికి చేరుకోగానే అక్కడ దానిపై పలు రసాయనాలు పనిచేస్తాయి. ఆ రసాయన చర్యలతో అది అన్ కాంజుగేటెడ్ బైల్‌రూబిన్ అనే పదార్థంగా తయారవుతుంది. కాలేయం దీనిని పైత్యరసంలోకి పంపిస్తుంది. ఈ జీర్ణరసం ద్వారా ఆహారంలోకి చేరిన బైల్‌రూబిన్ జీర్ణప్రక్రియ చివరివరకూ కొనసాగి చివరకు మలంతో విసర్జితం అవుతుంది. మలానికి గోధుమరంగు దీనివల్లనే ఏర్పడుతుంది. పలుకారణాలు, అలవాట్లు, వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడి కామెర్ల వ్యాధి వస్తుంది.
కామెర్ల వ్యాధిలో సర్వసాధారణంగా కనిపించేది, అత్యధికులకు తెలిసింది చర్మం, కళ్లు పచ్చగా మారటం. ఇది మొదట తల భాగంతో ప్రారంభించి క్రమంగా శరీరం అంతా వ్యాపిస్తుంది. ఈ పచ్చదనం కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఈ వ్యాధిలో గమనించవచ్చు.
దురదలు: చర్మంలో బైల్ సాల్ట్స్ అధికంగా చేరటంతో శరీరం అంతటా దురదలు పెడుతుంటాయి.
అలసట: స్పష్టమైన కారణం లేకుండానే విపరీతమైన అలసట ఏర్పడుతుంది. బరువు తగ్గిపోతుంది.
జ్వరం: హఠాత్తుగా జ్వరం వస్తుంది. వాంతులు అవుతాయి.
నొప్పి: పొట్టలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.మూత్రం, మలం రంగు మారుతుంది: సాధారణంగా కొద్దిపాటి పసుపు రంగుతో తేటగా ఉండే మూత్రం చిక్కగా, గోధుమ రంగులో వస్తుంది. అదే విధంగా మలం పసుపు, ఆకుపచ్చ రంగులో ఉండటం కూడా కామెర్ల వ్యాధి లక్షణాలలో ముఖ్యమైనది.
ప్రధానంగా రెండు కారణాల వల్ల జాండిస్ సోకుతుంది. వీటిలో మొదటిది శరీరంలో బైల్‌రూబిన్ అత్యధికంగా ఉత్పత్తి అవుతుండటం. రెండోది సహజంగా ఉత్పత్తి అవుతున్న బైల్రూబిన్ను కాలేయం తొలగించలేక పోవటం. ఈ రెండు సందర్భాలలోనూ బైల్‌రూబిన్ శరీర కణజాలంలో చేరి స్థిరపడుతుంది. కామెర్ల వ్యాధి సోకిన వ్యక్తి శరీర అంతర్భాగంలో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.
కాలేయం వాపు: ఇలాంటి పరిస్థితిలో బైల్రూబిన్ను గుర్తించి తొలగించే సామర్థ్యం కాలేయానికి తగ్గుతుంది. దీంతో రక్తంలో ఆ వ్యర్థపదార్థం పరిమాణం పెరుగుతూ ఉంటుంది.
బైల్ డక్ట్ వాపు: పైత్యరసం నాళం వాపు… జీర్ణరసం స్రవించటానికి తద్వారా బైల్రూబిన్ను తొలగించటానికి ఆటంకంగా తయారవుతుంది. దీంతో కామెర్ల వ్యాధి ఏర్పడుతుంది.
పైత్యరసనాళంలో అడ్డంకులు: ఇది బైల్రూబిన్ను తొలగించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
హెమోలైటిక్ ఎనిమియా: భారీ సంఖ్యలో ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నం అవుతున్నప్పుడు శరీరంలో పెద్ద మొత్తంలో బైల్‌రూబిన్ తయారవుతుంది. మలేరియా-తలసేమియా వ్యాధులు, కొన్ని ఔషధాలు ఎర్ర రక్తకణాలు భారీగా విచ్ఛిన్నం కావడానికి కారణం అవుతుంటాయి.
గిల్భర్ట్ సిండ్రోమ్: వంశపారంపర్యంగా ఏర్పడేఈ పరిస్థితి వల్ల పైత్యరసాన్ని విడుదల చేసే ఎంజైమ్‌ల సామర్థ్యం దెబ్బతింటుంది.
కొలెస్టాటిస్: కాలేయం నుంచి పైత్యరసం విడుదలకు ఆడ్డంకులు ఏర్పడతాయి. దాంతో కాంజుగేటెడ్ బైల్‌రూబిన్ విసర్జితం కావటానికి బదులు కాలేయంలోనే ఉండిపోతుంది. వయోజనుల్లో మరికొన్ని తీవ్రమైన కారణాల వల్ల కామెర్ల వ్యాధి వస్తుంది. వీటిలో కొన్ని ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీయవచ్చు కూడా. మితిమీరిన మద్యపానం (నాలుగైదేళ్లకు పైబడి), హెపటైటిస్ బి, సి వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామంది కామెర్ల వ్యాధికి గురవుతున్నారు. హెపటైటిస్ ఎ, ఇ వైరస్ల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. దీనిలో హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి ప్రాణానికి ముప్పు ముంచుకువస్తుంది. కలుషితమైన నీళ్లు, తిండి వల్ల ఈ తీవ్రమైన హైపటైటిస్ ఎ, ఇ వైరస్లు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.
చాలా సందర్భాలలో రోగి ఆరోగ్య చరిత్రను తెలుసుకోవటం, భౌతికంగా పరీక్షించటం, పొట్టను దగ్గరగా పరిశీలించటం ద్వారా డాక్టర్లు కామెర్ల వ్యాధిని గుర్తిస్తారు. పొట్టలో గడ్డలు ఏమైనా ఉన్నాయా, కాలేయం గట్టి పడిందా పరిశీలించి చూస్తారు. కాలేయం గట్టిగా మారటం సిరోసిస్ వ్యాధిని సూచిస్తుంది. అది రాయిలా మారటం క్యాన్సర్ లక్షణం. కామెర్ల తీవ్రతను తెలుసుకోవటానికి పలు రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి. వీటిలో మొదటిది లివర్ ఫంక్షన్ టెస్ట్. కాలేయం సరిగా పనిచేస్తున్నదీ లేనిదీ దీనితో వెల్లడవుతుంది. రోగిలో వ్యక్తమవుతున్న లక్షణాలకు కారణాలు బయటపడని పక్షంలో బైల్‌రూబిన్ పరిమాణం, రక్తపు తాజా పరిస్థితిని అర్థం చేసుకోవటానికి బైల్‌రూబిన్ టెస్ట్, ఫుల్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ బ్లడ్‌కౌంట్, హెపటైటిస్ వైరస్ పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేస్తారు.
నాళాలకు అడ్డంకులు ఏర్పడటం వల్ల కామెర్ల వ్యాధి వచ్చినట్లు అనుమానిస్తే ఎం.ఆర్.ఐ. స్కాన్, అబ్డామినల్ అల్ట్రా సోనోగ్రఫీ, కాట్ స్కాన్ వంటి పరీక్షలు చేయిస్తారు. సిరోసిస్, క్యాన్సర్, ఫ్యాటీ లివర్ ఏర్పడినట్లు అనుమానం కలిగితే బయాప్సీ చేయించాల్సిందిగా వైద్యులు సూచిస్తారు.
కామెర్ల చికిత్సకు ఇప్పుడు మంచి ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. చికిత్స నిర్లక్ష్యం చేస్తే.. కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. చికిత్సకు ముందు వ్యాధికి దారితీసిన కారణాలను గుర్తించేందుకు పరీక్షలు జరుపుతారు. తర్వాత కామెర్లను అదుపు చేయడం, నివారించడానికి చికిత్స అందిస్తారు. రక్తహీనత కారణంగా ఏర్పడిన కామెర్లను రక్తంలో ఎర్ర రక్తకణాలను అభివృద్ధి పరచటం ద్వారా అదుపుచేస్తారు. ఇందుకు ఐరన్ సప్లిమెంట్లను, ఇనుప ధాతువు అధికంగా ఉండే ఆహారం సిఫారసు చేస్తారు. హెపటైటిస్ కారణంగా వచ్చిన కామెర్లను తగ్గించటానికి యాంటి వైరల్, స్టెరాయిడ్ మందులను ఇస్తారు. నాళాలలో అడ్డంకుల కారణంగా కామెర్లు సోకితే శస్త్రచికిత్స ద్వారా ఆ ఆటంకాలను తొలగించి పరిస్థితి మెరుగుపరుస్తారు.
ఏవైనా మందులు వాడి, వాటిలోని రసాయనాల వల్ల కామెర్ల వ్యాధికి గురైన పక్షంలో.. తొలుత ఆ ఔషధాలు నిలిపివేయిస్తారు. ప్రత్యామ్నాయ మందులను సిఫారసు చేసి… దుష్ఫలితాలను తగ్గిస్తూ, వ్యాధికి చికిత్స అందిస్తారు. హెపటైటిస్ ఎ, ఇ వైరస్ల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. హఠాత్తుగా ప్రాణాల మీదికి వస్తుంది. కాలేయం మార్పిడి మాత్రమే దీనికి నమ్మకమైన చికిత్స. సజీవులైన లేదా బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి సేకరించిన ఆరోగ్యకర కాలేయంతో అవయవ మార్పిడి ఆపరేషన్ చేస్తారు. తర్వాత రోగి కోలుకునేలా అవసరమైన చికిత్స
అందిస్తారు.
– డాక్టర్ మహమ్మద్ అబ్దున్ నయీం
సీనియర్ లివర్ ట్రాన్స్ ప్లాంట్,
HPB & GI సర్జన్
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్