White Onions | ఉల్లిపాయలను మనం రోజూ అనేక కూరల్లో వేస్తూనే ఉంటాం. ఉల్లిపాయలు లేకుండా ఏ కూర కూడా పూర్తి కాదు అన్న సామెత అందరికీ తెలిసిందే. ఉల్లిపాయలను కచ్చితంగా కూరల్లో వేయాల్సిందే. అయితే ఆరోగ్య పరంగా చూస్తే ఉల్లిపాయలు మనకు అనేక లాభాలను అందిస్తాయి. ఉల్లిపాయల్లో పలు రకాలు ఉంటాయి. తెల్లవి, పింక్ రంగులో ఉండేవి, బ్రౌన్ రంగులో ఉండేవి. పింక్ రంగులో ఉండే ఉల్లిపాయలను ఎర్ర ఉల్లిపాయలు అని, కొందరు ఎర్ర గడ్డలు అని కూడా పిలుస్తారు. ఇక తెలుపు రంగులో ఉండే ఉల్లిపాయలను కొందరు తెల్ల గడ్డలు అని కూడా అంటారు. ఈ క్రమంలోనే రంగులో ఉన్న తేడాను బట్టి ఆయా ఉల్లిపాయలు అందించే ప్రయోజనాలు కూడా వేర్వేరుగానే ఉంటాయి. తెల్ల ఉల్లిపాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
తెల్ల ఉల్లిపాయల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, క్వర్సెటిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ వైరల్, యాంటీ హిస్టామైన్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక తెల్ల ఉల్లిపాయలను తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల మన శరీరానికి జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో క్యాన్సర్, గుండె జబ్బులు, నాడీ సంబంధ వ్యాధులు వంటి ప్రాణాంతక రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. తెల్ల ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తాయి. వాపుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అందువల్ల తెల్ల ఉల్లిపాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
తెల్ల ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ కారణంగా వీటిని తింటే మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. తెల్ల ఉల్లిపాయల్లో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీరంలోని ద్రవాలను సమతుల్యంలో ఉంచుతుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. దీని వల్ల హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. వీటిని తింటే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవచ్చు. దీంతో పలు రకాల క్యాన్సర్లు రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు.
తెల్ల ఉల్లిపాయలను ప్రీ బయోటిక్ ఫుడ్‌గా చెబుతారు. అంటే వీటిని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందన్నమాట. తెల్ల ఉల్లిపాయలను తినడం ద్వారా ఐనులిన్ వంటి ఫ్రక్టాన్స్ వృద్ధి చెందుతాయి. ఇవి మంచి బ్యాక్టీరియా కిందకు వస్తాయి. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. శరీరం రోగాలు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తెల్ల ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ పేగుల్లో మలం కదలికలను సులభతరం చేస్తుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది. తెల్ల ఉల్లిపాయల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. కనుక తెల్ల ఉల్లిపాయలను రోజూ తింటే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా తెల్ల ఉల్లిపాయలతో అనేక లాభాలను పొందవచ్చు.