Coffee Powder | అందంగా కనిపించాలని మహిళలు చాలా మంది కోరుకుంటారు. పురుషులు కూడా ఈ మధ్య తమ అందంపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తుంటారు. అయితే అందంగా కనిపించడం కోసం ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలు చేసుకుంటుంటారు. కానీ మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజసిద్ధంగా ముఖం అందంగా కనిపించేలా చేయవచ్చు. అందుకు కాఫీ పౌడర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాఫీ పొడితో కేవలం కాఫీని తయారు చేసి వేడిగా తాగడమే కాదు, దీన్ని అందం కోసం కూడా ఉపయోగించవచ్చు. దీంతో పలు ఇంటి చిట్కాలను పాటిస్తే మీ ముఖం అందంగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
కాఫీ పొడిలో కొద్దిగా కొబ్బరినూనె కలపాలి. అనంతరం అందులో కొద్ది తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని ముఖంపై రాయాలి. సున్నితంగా వృత్తాకారంలో మసాజ్ చేయాలి. తరువాత కొన్ని నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో 2 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. ఈ చిట్కాను పాటిస్తే ముఖంపై ఉండే మృత చర్మ కణాలు తొలగిపోతాయి. ముఖం చర్మం మృదువుగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. కాఫీ పొడిని గోరు వెచ్చని నీటితో కలిపి పేస్ట్‌లా చేసి శరీరం మొత్తానికి అప్లై చేయవచ్చు. తరువాత కాసేపు అయ్యాక స్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే మీ శరీరంపై చర్మం మొత్తం కాంతివంతంగా మారుతుంది. మృత చర్మ కణాలు పోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
కాఫీ పొడిలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి పేస్ట్‌లా చేసి ఈ మిశ్రమాన్ని కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌పై రాయాలి. 10-15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే కళ్ల కింద ఉండే నల్లని వలయాలు తొలగిపోతాయి. కళ్ల కింద ఉండే వాపుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కళ్లు ప్రశాంతంగా మారి ఆరోగ్యంగా కనిపిస్తాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. కాఫీ పొడి, తేనెతో ఫేస్ ప్యాక్ తయారు చేసి కూడా వాడవచ్చు. కాఫీ పొడిని 1 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని అందులో కాస్త తేనె, పెరుగు కలిపి ఫేస్ ప్యాక్‌లా తయారు చేయాలి. దీన్ని ముఖం, మెడపై రాయాలి. కళ్లలో పడకుండా చూడాలి. 20 నిమిషాలు ఈ ప్యాక్‌ను అలా ఉంచి తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖానికి తేమ లభిస్తుంది. ముఖం సహజసిద్ధమైన నిగారింపును పొందుతుంది.
కాఫీ పొడి, సముద్రపు ఉప్పు, కొబ్బరినూనెలను తీసుకుని బాగా కలిపి మెత్తగా చేయాలి. దీన్ని పాదాలపై రాయాలి. 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే పాదాల పగుళ్లు తగ్గిపోతాయి. పాదాలు మృదువుగా మారి అందంగా తయారవుతాయి. కాఫీ పొడిలో కొద్దిగా జుట్టు కండిషనర్ కలిపి దాంతో జుట్టుకు హెయిర్ ప్యాక్‌లా వేసుకోవాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మృత చర్మ కణాలు పోతాయి. చుండ్రు తగ్గుతుంది. శిరోజాలు సహజసిద్ధంగా నల్లగా మారుతాయి. ఈ చిట్కాను నెలకు 2 సార్లు పాటించాల్సి ఉంటుంది. కాఫీ పొడిలో కొద్దిగా నీరు, హెన్నా కలిపి శిరోజాలకు హెయిర్ ప్యాక్ లా వేస్తున్నా కూడా జుట్టు సహజసిద్ధంగా నల్లగా మారుతుంది. ఇలా కాఫీ పొడిని కేవలం కాఫీ తాగేందుకే కాకుండా అందం కోసం కూడా ఉపయోగించవచ్చు.