మా పాపకు తొమ్మిది నెలలు. వారం క్రితం బాగా జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే మందులు రాశారు. తగ్గలేదు. జ్వరం తప్ప జలుబు, దగ్గు వంటి వేరే ఇబ్బందులేవీ లేవు. మూత్రపరీక్ష చేయిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ యాంటిబయాటిక్ మందులు ఇచ్చారు. అవి వాడిన తర్వాత జ్వరం పూర్తిగా తగ్గింది. పాప హుషారుగానే ఉంది. డాక్టర్‌కి చూపించినప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించమన్నారు. అది కూడా చేయించాం. ఆ తర్వాత మూత్రం వెనక్కి పోతుందనే సందేహం ఉంది.. కాబట్టి మరో స్కాన్ చేయాలంటున్నారు. నిజంగా అది అవసరమా?
మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ బిడ్డకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) ఉంది. చిన్నపిల్లల్లో ఇలాంటి సమస్య ఉంటే ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ ద్వారా ఇన్ఫెక్షన్ కిడ్నీల్లో ఉందా? మూత్రనాళాల్లో ఉందా? కేవలం మూత్రాశయంలో ఉందా? అనేది తెలుస్తుంది. కొంతమందిలో అరుదుగా పుట్టుకతోనే మూత్ర విసర్జక వ్యవస్థ నిర్మాణంలో లోపాలు ఉంటాయి. అలాంటి సమస్యలు ఏవైనా ఉంటే అల్ట్రా సౌండ్ పరీక్షలో తెలుస్తాయి. ఈ పరీక్ష చేశారు. కాబట్టి మీ బిడ్డకు ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉందో డాక్టర్‌కు తెలిసే ఉంటుంది.
కానీ, ఆ ఇన్ఫెక్షన్కు కచ్చితమైన కారణం కూడా తెలియాలి. సాధారణంగా కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసి నీరు, వ్యర్థాలను వడపోస్తాయి. కిడ్నీల్లో మూత్రం నాళాల ద్వారా కిందికి వచ్చి మూత్రాశయానికి చేరుతుంది. ఆ మూత్రాశయం నుంచి జననాంగంలోని మూత్రనాళం ద్వారా బయటికి పోతుంది. కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే మూత్ర విసర్జన సమస్య ఉంటుంది. మూత్రాశయం నుంచి వ్యతిరేక దిశలో మూత్రం ప్రయాణిస్తుంది. వెసికో యూరెటెరిక్ రిఫ్లక్స్ అంటాం.
ఈ సమస్య ఉన్నట్టయితే బిడ్డకు యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గినా తర్వాత రాకుండా ఉండేందుకు కూడా కొద్ది మోతాదులో యాంటిబయాటిక్ మందులు వాడాల్సి ఉంటుంది. దాదాపు రెండు సంవత్సరాల వయసు వరకు వాడాలి. రెండేళ్ల వయసు దాటిన తర్వాత సమస్య ఉన్నదీ, లేనిదీ మెచ్యురేటింగ్ సిస్టో యురెథ్రోగ్రామ్ (ఎంసీయూజీ) పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. మూత్రం వచ్చే మార్గంలో ట్యూబ్ పెట్టి, రంగు నీటిని అందులోకి పంపుతారు. ఆ నీరు మూత్రనాళంలో దిగువకు కాకుండా పైకి ప్రయాణిస్తే ఎంసీయూజీ పరీక్షలో గుర్తించవచ్చు.
మీ పాపకు బహుశా ఎంసీయూజీ పరీక్ష చేయాలని వైద్యులు సూచించి ఉండవచ్చు. ముందు బిడ్డకు వెసికో యురెటెరిక్ రిఫ్లక్స్ సమస్య ఉందా? లేదా? తెలుసుకోవాలి. ఉంటే యాంటిబయాటిక్ మందులు వాడి సమస్యను తగ్గించుకోవచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా బిడ్డకు నీళ్లు బాగా తాగించాలి. న్యాపీ వాడుతున్నట్లయితే సమయానికి మార్చాలి. న్యాపీ తీసిన తర్వాత వెనక భాగం తర్వాత ముందు భాగం శుభ్రం చేయకుండా, ముందు భాగం నుంచి వెనక్కి శుభ్రం చేయాలి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్