Type 2 Diabetes Symptoms | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అధిక శాతం మంది గుండె జబ్బుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. కోవిడ్ అనంతరం హార్ట్ ఎటాక్ల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది అన్న విషయంపై ఇప్పటికీ చాలా వరకు స్సష్టత లేదు, కానీ గుండె జబ్బుల మరణాలు అందరినీ కలవర పెడుతున్నాయి. చాలా మందికి గుండె జబ్బులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే గుండె జబ్బులతోపాటు ప్రస్తుతం చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ కూడా వస్తోంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా టైప్ 2 డయాబెటిస్ బాధితుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. భారత్‌లో ఈ సంఖ్య మరీ అధికంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అందుకనే భారత్‌ను ప్రస్తుతం డయాబెటిస్‌కు ప్రపంచ రాజధానిగా చెబుతున్నారు. అయితే టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అస్తవ్యవస్తమైన జీవనశైలిని ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండకపోవడం, జంక్ ఫుడ్‌ను అధికంగా తినడం, పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోకపోవడం, రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం, ఆలస్యంగా నిద్రించడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి అనేక కారణాల వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. అయితే టైప్ 2 డయాబెటిస్ వచ్చిన తరువాత బాధ పడడం కన్నా రాక ముందే దాన్ని నివారించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నప్పుడే మన శరీరం మనకు పలు లక్షణాలను సంకేతాలను తెలియజేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ రావడానికి ముందే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గమనించడం ద్వారా ముందుగానే జాగ్రత్త పడితే టైప్ 2 డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.
టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముందు బరువు సడెన్‌గా తగ్గుతారు. గాయాలు, పుండ్లు నెమ్మదిగా మానుతాయి. లేదా ఎంత కాలం ఉన్నా అవి అసలు మానవు. తీవ్రమైన నీరసం, అలసట ఉంటాయి. చిన్న పని చేసినా సులభంగా అలసిపోతారు. విపరీతమైన దాహం ఉంటుంది. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. రాత్రి పూట మూత్ర విసర్జనకు నిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే అతిగా ఆకలి ఉంటుంది. చర్మం దురదలు పెట్టి దద్దుర్లు వస్తాయి. మూడ్ మారుతుంది. డిప్రెషన్ బారిన పడతారు. ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటాయి. తల తిరిగినట్లు అనిపిస్తుంది. కొందరికి వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలా ఆయా లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను కలిసి షుగర్ టెస్టులు చేయించుకోవాలి. షుగర్ పెరిగినట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీంతో టైప్ 2 డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్లు ఇచ్చే మందులను వాడడంతోపాటు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. దీంతో వ్యాధి త్వరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. సాధారణంగా ఏ డయాబెటిస్ ఉన్నవారికి అయినా సరే ఉదయం భోజనం చేయకముందు షుగర్ లెవల్స్ 80 నుంచి 110 మధ్య ఉండాలి. అదే ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత అయితే షుగర్ లెవల్స్ 110 నుంచి 150 మధ్య ఉండాలి. అంతకు మించితే దాన్ని డయాబెటిస్ అంటారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ వ్యాయామం చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే తేలికపాటి వాకింగ్ చేస్తుంటే ఉపయోగం ఉంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే తాజా పండ్లు, కూరగాయలను అధికంగా తినాలి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తెల్లని పదార్థాలను తినడం తగ్గించాలి. రాత్రి పూట త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రించాలి. ఇలా ఆయా జాగ్రత్తలను పాటిస్తుంటే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.