మానవ శరీరంలో జీర్ణ వ్యవస్ధ వంటి పలు వ్యవస్ధలతో పాటు ఇన్ఫెక్షన్లతో పోరాడే వ్యాధి నిరోధక వ్యవస్ధ కూడా ఉంటుంది. బయట నుంచి దాడి చేసే బ్యాక్టీరియా, వైరస్లు, పారాసైట్ల నుంచి రోగనిరోధక వ్యవస్ధ మన శరీరాన్ని కాపాడుతుంది. పలు అనారోగ్యాలు, సాధారణ జలుబు నుంచి కొవిడ్-19 వరకూ వివిధ ఇన్ఫెక్షన్లు, అస్వస్ధతలను ఇమ్యూనిటీ దీటుగా ఎదుర్కొంటుంది. టీకాలతోనే కాకుండా సహజంగా మన ఇమ్యూనిటీని మెరుగుపరుచుకోవచ్చని హార్వర్డ్ హెల్త్ పలు సూచనలు చేసింది.
తగినంత నీరు : ఇమ్యూనిటీ పెరగాలంటే నీరు ఎక్కువగా తాగాలని రోజుకు కనీసం ఆరు నుంచి ఏడు గ్లాసుల వాటర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాలయ జ్యూస్, కొబ్బరి నీళ్ల వంటివి తరచూ తీసుకుంటే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు.
విటమిన్ సీ : ఇక విటమిన్ సీ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్, నిమ్మ, బ్రొకోలి, సిట్రస్ పండ్లు, పెప్పర్ వంటి సీ విటమిన్ అధికంగా ఉండే ఆహారంతో ఇమ్యూనిటీ మెరుగవుతుంది.
ఒత్తిడికి దూరం : ఒత్తిడిని తగ్గించుకోవడం ఇమ్యూనిటీ మెరుగుదలకు అత్యంత కీలకం. ఒత్తిడి, కుంగుబాటు ఇమ్యూనిటీని దెబ్బతీసి మనిషిని శారీరకంగా, మానసికంగా బలహీనపరుస్తుంది. యోగ, వ్యాయామం, మంచి ఆహారంతో ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.
నిద్రలేమికి చెక్ : ఇక కంటినిండా నిద్రపోవడం ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. నిద్రలేమితో శరీరం బలహీనపడి వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారినపడే ముప్పు పెంచుతుంది.
చేతుల పరిశుభ్రత : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో చేతులను శుభ్రపరుచుకోవడం, శారీరక పరిశుభ్రతను పాటించడం అత్యవసరం. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా ఉండటంతో పాటు ఇమ్యూనిటీని మెరుగుపరిచేందుకు చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. వీటితో పాటు మద్యపానం, ధూమపానం అలవాట్లను వదిలించుకోవాలి. ఆరోగ్యకరమైన బరువు కలిగిఉండటం, ఇంట్లో వండిన ఆహార పదార్ధాలనే తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.