మా అబ్బాయి వయసు అయిదేండ్లు. చలికాలం మొదలైందంటే చాలు జలుబు, దగ్గుతో బాధపడుతుంటాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నెబ్యులైజర్ వాడమన్నారు. వాడితే తగ్గిపోతుంది. ఇలా ఎండకాలం వచ్చేదాకా నెబ్యులైజర్ వాడాల్సి వస్తుంది. మిగతా కాలంలో బాగానే ఉంటాడు. ఈ సమస్యకు పరిష్కారం సూచించగలరు?
మీ బిడ్డకు శ్వాసనాళాలు కుంచించుకుపోయే ‘హైపర్ యాక్టివ్ ఎయిర్వే డిసీజ్’ ఉండి ఉండొచ్చు. చల్లని వాతావరణం, దుమ్ము, కాలుష్యం, శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్ల బారినపడినప్పుడు కొందరిలో శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి. ఇలా జరిగినప్పుడు పిల్లల్లో పిల్లికూతల వంటి చప్పుడు వస్తుంది. ఇది పెద్దవాళ్లలో ఉండే ఆస్తమా లాగా ఉంటుంది. ఈ సమస్యకు నెబ్యులైజర్ ఉపశమనం కలిగిస్తుంది. బిడ్డకు పదేపదే ఇలా జరుగుతుంటే దీని నివారణ కోసం చికిత్స కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్హేలర్ వాడాలి. మన సమాజంలో ఇన్హేలర్ వాడకం పట్ల అపోహలు, భయాలు ఉన్నాయి. ఇన్హేలర్ తక్కువ డోసులో సమస్య తీవ్రతను తగ్గిస్తుంది. మీ బాబుని శ్వాసకోశ నిపుణులకు చూపించండి. ప్రివెంటివ్ థెరపీ, ఇన్హేలర్ థెరపీ అవసరాన్ని బట్టి తీసుకోండి.
ఏ కారణం వల్ల ఈ సమస్య వస్తుందో గుర్తించడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. సమస్యకు కారణం తెలిస్తే పిల్లల్ని దానికి దూరంగా ఉంచితే అది పరిష్కారమైనట్టే. డైరీ పెట్టుకుని ఎప్పుడు ఇబ్బంది పడుతున్నాడు? ఎంత తీవ్రంగా ఉంది? మందు ఇస్తే, దాని ప్రభావాన్ని రాస్తూ పోవాలి. అలాగే ఎదుగుదల ఎలా ఉందో కూడా రాయాలి. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కూడా దీనికి కారణం కావొచ్చు. మీ బిడ్డ సమస్య ఆస్తమా అయి ఉండొచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా ఎలర్జీ, ఆస్తమా వంటి లక్షణాలు ఉన్నదీ, లేనిదీ చెప్పలేదు. ఆస్తమా అంటే చాలామంది భయపడతారు. పద్ధతి ప్రకారం వైద్యం చేస్తే ఆస్తమాను తగ్గించవచ్చు. ఇప్పుడు మీరు రెండు ముఖ్యమైన పనులు చేయాలి. బిడ్డకు పోషకాహారం ఇవ్వడం ద్వారా ఈ అనారోగ్య సమస్యను తట్టుకునేలా సిద్ధం చేయడం మొదటిది. పిల్లల శ్వాసకోశ వైద్యులు సూచించిన మందులు, ఇన్హేలర్ వాడటం రెండోది. వీటివల్ల కొంత ఉపశమనం లభించవచ్చు.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్