Digital Eye Strain | ప్రస్తుత రోజుల్లో అన్ని ఉద్యోగాల్లో కంప్యూటర్లపై ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తున్నది. వీటికి తోడు మొబైల్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో కంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌పై పనిచేయడం వల్ల కంటికి వచ్చే సమస్యలనే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని పిలుస్తారు. కంప్యూటర్ల ముందు ఏకబిగిన 2 గంటల కన్నా ఎక్కువ సమయం గడిపే వారికి ఈ సమస్య బారిన పడే ప్రమాదం ఉంటుంది.
కళ్లు త్వరగా అలసిపోవడం, కంటి నుంచి నీరు కారడం, మంటగా ఉండటం, కళ్లు ఎరుపుగా మారడం, మసక దృష్టి, కళ్లు వణకడం వంటి లక్షణాలతో డిజిటల్ ఐ స్ట్రెయిన్ బారిన పడినట్లు గుర్తించవచ్చు. వీటితో పాటు తలనొప్పి, మెడ, భుజం నొప్పులు వంటివి కూడా డిజిటల్ ఐ స్ట్రెయిన్‌కు గురైనట్లు తెలిపే లక్షణాలుగా గుర్తించాలి. ఎక్కువ సమయం పాటు కంప్యూటర్‌పై పనిచేసే వారి కంటి చూపు మసకబారడం మొదలవుతుంది. తెరపై కనిపించే వస్తువులు రెండుగా కనిపిస్తాయి.
తరచుగా విరామాలు తీసుకోవడం..
ల్యాప్‌టాప్‌పై పని చేస్తున్నప్పుడు మధ్యమధ్య విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కళ్ళలో ఒత్తిడిని తగ్గించడానికి కొద్ది దూరంలోని వస్తువులను చూడాలి. పని మధ్య విరామాలు తీసుకునేటప్పుడు ఫోన్లను ఉపయోగించడం మానుకోవడం మంచిది. పనిచేస్తున్నప్పుడు తరచుగా రెప్పవేస్తూ ఉండాలి. ఎక్కువసేపు స్క్రీన్ వైపు చూడకుండా ఉండాలి.
నిత్యం వ్యాయామం చేయడం..
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనకు తెలుసిందే. వ్యాయామం కళ్ళతో సహా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సాయపడుతుంది. అందువలన నిత్యం వ్యాయామం చేయడం వలన కళ్ళ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
సరైన కూర్చునే భంగిమ..
ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కూర్చునే భంగిమ సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. పడుకొని ఉండకుండా చూసుకోవాఇ. ఇది కంటికి ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే వెన్నునొప్పికి కూడా దారితీస్తుంది. ల్యాప్‌టాప్ స్క్రీన్ ముఖానికి కనీసం 25 అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
కృత్రిమ కన్నీళ్ల వాడకం..
పొడి లేదా ఎరుపు కళ్ళ సమస్యను కలిగి ఉన్నప్పుడు కళ్ళు ఉపశమనం పొందడానికి కృత్రిమ కంటి చుక్కలను ఉపయోగించవచ్చు.
తగినంత కాంతి ఇవ్వడం..
చీకటి వాతావరణంలో ల్యాప్‌టాప్‌పై పని చేయకుండా చూసుకోవాలి. చీకట్లో ఇలాచేయడం వల్ల కళ్ళ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కళ్ళపై ఒత్తిడి పడకుండా ఉండటానికి ప్రకాశవంతమైన కాంతి ఉండేలా చూసుకోవాలి. స్క్రీన్ కాంట్రాస్ట్, స్క్రీన్ టెక్స్ట్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు.
తరచుగా కంటి పరీక్షలు..
కంటి ఆరోగ్య సమస్యలను నివారించుకునేందుకు కళ్ళను తరచుగా తనిఖీ చేయించుకోవాలి. ఇది దృష్టి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏవైనా ఇతర కంటి సమస్యలను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది.
స్క్రీన్ వల్ల కలిగే నష్టం నుంచి కళ్ళను రక్షించుకోవడానికి కంప్యూటర్ గ్లాసెస్ ఉపయోగించవచ్చు. కళ్ళకు విశ్రాంతిని అందించడానికి కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చేతులతో రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి. చల్లటి నీరుతో ముఖం కడుక్కోవడం వల్ల కూడా కంటిపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.