కొంతమందిలో తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం సమస్యగా ఉంటుంది. ఇంకొంతమందిలో మూత్ర విసర్జన అతి స్వల్పంగా జరుగుతుంది. వీటిని శరీర పనితీరుకు సూచికలుగా పరిగణించాలి అంటున్నారు వైద్యులు. ఆరోగ్యవంతులు రోజుకు 6 నుంచి 7 సార్లు మూత్రానికి వెళ్తారు. కాకపోతే, నాలుగు నుంచి పదిసార్ల వరకు కూడా సాధారణంగానే పరిగణిస్తారు. రాత్రుల్లో ఒకసారి వెళ్తే ఎక్కువ. అలాంటిది రాత్రి వేళ మూత్రానికి తరచుగా వెళ్తున్నారంటే ఏదో సమస్య ఉన్నట్టే. హార్మోన్లలో మార్పులు, మూత్రాశయం మీద ఒత్తిడి లాంటివి కూడా మూత్రం తరచుగా వెళ్లడానికి దారితీస్తాయి.
గర్భిణుల్లో తాత్కాలిక మూత్రాశయ సమస్యలు సహజం. శిశువు పుట్టిన తర్వాత ఎనిమిది వారాల వరకు స్త్రీలలో తరచుగా మూత్రానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. పెద్దలు రోజులో ఎంత మొత్తంలో ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారు, ఆ పదార్థాలు ఎలాంటివనే విషయాలపైనా అతి మూత్ర సమస్య ఆధారపడి ఉంటుంది. కొన్నిరకాల మందులు కూడా ఈ సమస్యకు ఇతోధికంగా దోహదపడతాయి. వీటిని డైయూరెటిక్స్ అంటారు. కాకపోతే ఈ నియమాలు పెద్దలకే తప్ప పిల్లలకు వర్తించవు.
డీహైడ్రేషన్: తగినన్ని నీళ్లు తాగకపోతే మూత్రం గాఢంగా తయారవుతుంది. దీంతో మూత్రానికి తక్కువగా వెళ్తారు. ఇది డీహైడ్రేషన్‌కు గుర్తు.
కిడ్నీ సమస్యలు: కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్లు కూడా సాధారణ మూత్ర వ్యవస్థ ఆరోగ్యానికి ఆటంకం కలిగిస్తాయి.
మూత్రం పట్టి ఉండటం: కొంతమందిలో ప్రొస్టేట్ సమస్యలు, నరాల సమస్యలు ఉంటాయి. దీంతో మూత్రాశయం నుంచి మూత్ర విసర్జన కష్టతరంగా ఉంటుంది. దీన్ని యూరినరీ రిటెన్షన్ అంటారు.
మూత్రానికి వెళ్లే పరిస్థితిలో అకస్మాత్తుగా, తీవ్రమైన మార్పులు పరిశీలిస్తే వైద్య సహాయానికి వెళ్లాలి. పెద్దల్లో మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. ఇందులో ఏ మార్పు కనిపించినా లోలోపలి సమస్యకు సంకేతంగానే భావించాలి. మూత్రం పోస్తున్నప్పుడు అసౌకర్యంగా, నొప్పిగా ఉండటం, మూత్రంలో రక్తం వంటి సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.