Ragi Malt | వేసవి కాలంలో శరీరం చల్లగా ఉండేందుకు, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది అనేక ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. వాటిల్లో రాగి జావ కూడా ఒకటి. రాగి జావను చాలా మంది రాగి పిండితో తయారు చేస్తారు. రాగులను పిండిగా మార్చి దాంతో జావ తయారు చేసుకుని తాగుతారు. అయితే ఇలా చేసి కూడా రాగి జావను తాగవచ్చు. కానీ రాగి జావను తయారు చేసే పద్ధతి అయితే ఇది కాదు. ఎలా అంటే.. రాగులను ముందుగా నీటిలో నానబెట్టాలి. సుమారుగా 12 గంటలపాటు నానిన తరువాత వాటిని వస్త్రంలో చుట్టి మొలకెత్తించాలి. మొలకెత్తిన రాగులను మళ్లీ ఎండబెట్టాలి. అనంతరం వాటిని పొడి చేయాలి. దాంతో రాగి జావ తయారు చేయాలి. ఆ జావలో కాస్త మజ్జిగ కలిపి తాగాలి.
రాగి జావను ఇలా రాగి మొలకలతో తయారు చేసి తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. శరీరానికి ఇంకా ఎక్కువ పోషకాలు లభిస్తాయి. రాగులతో జావను తయారు చేసి తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రాగుల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. రాగులతో చేసిన జావను రోజూ తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా మారకుండా ఉంటాయి. రాగుల్లో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరిగ్గా లభించేలా చూస్తుంది. దీంతో నీరసం, అలసట తగ్గి ఉత్సాహంగా మారుతారు. శరీరానికి శక్తి లభించినట్లు ఫీలవుతారు. ఉత్తేజంగా మారుతారు.
రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. రాగి జావను తాగడం వల్ల అందులో ఉండే ఫైబర్ షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను సైతం తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. రాగుల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మిథియోనైన్, లైసీన్ అనబడే అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి పనిచేస్తాయి. కండరాల నొప్పులను తగ్గిస్తాయి. రాగుల్లో థయామిన్, రైబో ఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్ వంటి బి విటమిన్లు అనేకం ఉంటాయి. అలాగే విటమిన్ సి, ఇ కూడా వీటిల్లో అధికంగానే ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా చూస్తాయి.
రాగుల్లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో అజీర్తి తగ్గుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలిచ్చే తల్లులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. రోజూ రాగులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో శిశువు ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా రాగులతో జావను తయారు చేసి తాగితే ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. కనుక వేసవిలో రోజూ తప్పకుండా రాగి జావను తాగడం అలవాటు చేసుకోండి.