Spinach | మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పాలకూర చాలా ముఖ్యమైంది. పాలకూరత మనం రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. పాలకూరలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. తాజా పాలకూర కట్టలో 100 గ్రాములకు సుమారు 4.4 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారు పాలకూరను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడే వారికి పాలకూరను తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. రక్తహీనతను తగ్గించడంలో పాలకూర సహాయపడినప్పటికీ మనం తీసుకునే మోతాదు, దానిని ఇతర ఆహారాలపై కలిపి తీసుకోవడంపై ఇది ఆధారపడి ఉంటుంది. మన శరీరానికి ఐరన్ ను అందిస్తుంది కదా అని దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కూడా మంచిది కాదు.
అసలు పాలకూరను తీసుకోవడం వల్ల మన శరీరంలో ఐరన్ స్థాయిలు పెరుగుతాయా.. అలాగే పాలకూర దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలను ఎలా అందిస్తుంది.. అలాగే దీనిని తీసుకునే విధానాన్ని.. పోషకాహార వైద్యులు వివరిస్తున్నారు. శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచడంలో పాలకూర సహాయపడినప్పటికీ అది కొంత వరకు మాత్రమే. ఎందుకంటే మన వయసును బట్టి మన శరీరానికి ఐరన్ అవసరాలు ఉంటాయి. సమతుల్య, పోషకాహారంలో భాగంగా పాలకూరను తీసుకున్నప్పుడే మనం ఐరన్ స్థాయిలను పెంచుకోవచ్చు. అయితే పాలకూరను తీసుకున్నప్పటికీ మన శరీరం దానిలో ఉండే ఐరన్ ను పూర్తిగా శోషణ చేసుకుంటుందా లేదా అని కూడా నిర్దారణ చేసుకోవాలి. అలాగే ఐరన్ స్థాయిలను పెంచుకోవడానికి పాలకూరతో పాటు ఐరన్ ఉండే ఇతర ఆహారాలను తీసుకోవడం చేయాలి.
నాన్ హీమ్ ఐరన్ శరీరంలో త్వరగా శోషించబడదు. కనుక విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవడం కూడా ముఖ్యం. ఉదాహరణకు పాలకూరను టమాటాలతో కలిపి తీసుకోవడం వల్ల దానిలో ఉండే నాన్ హీమ్ ఐరన్ ను శరీరం కొంత వరకు మాత్రమే గ్రహిస్తుంది. అలాగే పాలకూరను తీసుకునే విధానం, దాని తయారీ విధానం, దానిని ఉడికించే సమయం, మనం దీనిని తీసుకునే సమయం.. ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పాలకూర మన శరీరంలో కొంత వరకు మాత్రమే ఐరన్ స్థాయిలను పెంచుతుంది. కనుక ఐరన్ కోసం పూర్తిగా పాలకూరపై ఆధారపడడం మంచిది కాదు. ఇక తీవ్ర రక్తహీనతతో బాధపడే వారు వైద్యుడిని సంప్రదించి ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.
పాలకూరలో విటమిన్ ఎ, సి, కె, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం గడ్డకట్టడంలో, ఎముకలను దృఢంగా చేయడంలో కూడా పాలకూర మనకు సహాయపడుతుంది. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను కాపాడడంలో కూడా ఇవి మనకు దోహదపడతాయి. కనుక పాలకూరను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. పాలకూర గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడంతో పాటు గుండెపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. పాలకూరలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి, దీనిలో థైలాకోయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గడంలో పాలకూర మనకు ఎంతో దోహదపడుతుంది.
పాలకూరను ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. అలాగే పాలకూరను వండేటప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత మీద పాలకూరను ఉడికించడం వల్ల పోషకాలు నశిస్తాయి. పాలకూరను స్మూతీలతో కలిపి అల్పాహారంగా తీసుకోవడం మంచిది. పాలకూర ఆకులను సలాడ్ లలో ఉపయోగించడం వల్ల దానిలో ఉండే పోషకాలు పెరుగుతాయి. ఈ విధంగా పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని విటమిన్ సి ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల ప్రభావవంతంగా పని చేస్తుంది.