Green Tea | మొన్నటి వరకు అందరూ చాయ్, కాఫీ తాగేవారు. ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో గ్రీన్‌టీకి అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం ఆఫీసుల్లో, ఇండ్లలో గ్రీన్ టీ తాగే వారి సంఖ్య పెరిగింది. మార్కెట్లో కూడా గ్రీన్ టీకి భళే డిమాండ్ వచ్చింది. గ్రీన్ టీ ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు, క్యాటెచిన్స్ వంటి బయోయాక్టీవ్ పాలిఫెనాల్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ యాంటీఆక్సిండెట్లే. ఇవి ఫ్రీరాడికల్స్ డ్యామేజీని అరికడతాయి. అయితే, గ్రీన్ టీతో ప్రయోజనాలు ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు, లెక్కలేకుండా తాగడం కూడా అంత మంచిది కాదని సెలవిస్తున్నారు నిపుణులు.
గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పలు రకాలైన క్యాన్సర్ల నుంచి కాపాడటంలో తోడ్పడతాయి. గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది. కీళ్ళ నొప్పి,కీళ్ళవాతం ఇబ్బందుల నుంచి మనలని కాపాడుతుంది. మెదడు ఎఫెక్టీవ్‌గా పనిచేయడంలో దోహదపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. నోటి ఆరోగ్యానికి మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. ఎక్కువ సేపు పనిచేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది.
ఎలా తాగితే మంచిది..
వేడి నీటిలో డైరెక్ట్‌గా గ్రీన్ టీ కలపొద్దు. ఇలా చేయడం వల్ల దానిలోని కాటెచిన్స్ నాశనమవుతాయి. నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాతనే గ్రీన్ టీ కలపాలి. డికాఫినేషన్ ప్రక్రియ కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల దానిలోని ఆరోగ్యకరమైన పోషకాలు నశించిపోతాయి. గ్రీన్ టీలో నిమ్మరసం కలుపుకొని తాగడం చాలా మంచిది. నిమ్మరసం గ్రీన్ టీలోని పోషకాలను శరీరం గ్రహించడంలో సాయపడుతుంది. చవకైన గ్రీన్ టీ కాకుండా మంచి పేరున్న కంపెనీల గ్రీన్ టీనే తాగడం ఉత్తమం. చవకైనవి మన జేబుల్ని ఖాళీ చేస్తాయి కానీ ఎలాంటి ఆరోగ్యాన్ని అందించవు.
ఎంత తాగితే మంచిది..
గ్రీన్ టీ ఆరోగ్యకరమని ఎక్కువ తాగకూడదు. రోజులో సగటున 3 కప్పులకు మించకుండా చూసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలతోపాటు ఆందోళన కలిగిస్తుంది. మితంగా వాడితేనే ఏదైనా మంచి ఫలితాన్నిస్తుందని గుర్తుంచుకోవాలి.
ఎప్పుడు తాగకూడదు..
మనలో చాలా మంది గ్రీన్ టీని ఉదయం పూట తాగుతున్నారు. ఇలా తాగడం ఎంత మాత్రమూ మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణం వ్యవస్థ చెడిపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసిన తర్వాత ఉదయం 11 – 12 గంటల మధ్య, భోజనానికి గంట ముందు, సాయంత్రం అల్పాహారం తర్వాత గ్రీన్ టీ తాగకూడదు. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.