న్యూఢిల్లీ : శీతాకాలంలో దగ్గు, జలుబు ఇతర ఇన్ఫెక్షన్లు, చర్మ సంబంధ సమస్యలు వేధిస్తుంటాయి. చలికాలంలో ఇమ్యూనిటిని పెంచే ఆహారంతో అనారోగ్య సమస్యలను నివారించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం కారణంగా జుట్టు ఊడిపోవడం, అజీర్తి, మలబద్ధకం వంటి పలు ఇబ్బందులు ఎదురవుతాయి.
వీటన్నింటిని అధిగమించేందుకు వింటర్లో సరైన ఆహారాన్ని తీసుకోవాలని సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్ చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో సహజమైన ల్యాక్సేటివ్‌గా పేరొందిన ఎడిబుల్ గమ్‌ను ఆహారంలో తీసుకోవడం ద్వారా మలబద్ధకం తొలగి ప్రేవుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఎడిబుల్ గమ్‌ను సబ్జి, లడ్డూ, హల్వా వంటి వంటకాల్లో వాడవచ్చని రుజుత దివాకర్ తెలిపారు. ఇక వంటకాల రుచులను పెంచేందుకు వాడే వెల్లుల్లిలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి.
గ్రీన్ వెల్లుల్లిలో అసిలిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుందని ఆమె చెబుతున్నారు. వింటర్లో తప్పనిసరిగా వాడాల్సిన మరో వెజిటబుల్ ముల్లంగి. ఇందులో ఫైబర్‌తో పాటు మాంగనీస్, సెలీనియం వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయి. ముల్లంగిలో ఉండే లెసిథిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరానికి మేలు చేయడంతో పాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడే పలు విటమిన్లు ఉంటాయి.
వీటితో పాటు సీ విటమిన్, యాంటీఆక్సిడెంట్లు పుస్కలంగా ఉండే ఉసిరి, బీట్రూట్, పాలకూర, బ్రకోలి వంటి వాటిని ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలని రుజుత దివాకర్ సూచిస్తున్నారు. రోజూ పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు విధిగా తీసుకోవాలని చెప్పారు.