Fiber Foods | చియా గింజలు ఫైబర్‌కు మంచి మూలంగా పేరుపొందాయి. అందుకే స్మూతీలు, పుడ్డింగ్‌లు, బ్రేక్‌ఫాస్ట్ బౌల్స్‌లో వీటిని చాలామంది తరచూ ఉపయోగిస్తుంటారు. అయితే ఫైబర్ పొందడానికి చియా గింజలే ఒక్కటే మార్గం కాదు. రోజూ ఒకే ఆహారం తీసుకోవడం విసుగుగా అనిపించినా, లేదా చియా గింజలు జీర్ణవ్యవస్థకు సరిపోకపోయినా, వాటికి బదులుగా మరికొన్ని ఫైబర్ అధికంగా ఉండే గింజలను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు శరీరానికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి.
పోషకాహార నిపుణుల ప్రకారం అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) చియా గింజల కంటే ఎక్కువ ఇన్‌సాల్యూబుల్ ఫైబర్‌ను కలిగి ఉంటాయి. అలాగే లిగ్నాన్స్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ మొక్కల సమ్మేళనాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మలబద్ధకాన్ని తగ్గించడం, మల విసర్జనను క్రమబద్ధీకరించడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి. సబ్జా గింజలు (బాసిల్ సీడ్స్) చియా గింజలతో పోలిస్తే ఫైబర్ కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, నీటిని ఎక్కువగా పీల్చుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీంతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఇవి చియా గింజల కంటే మృదువైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి.
ఇసబ్గోల్ (సైలియం హస్క్)లో చియా గింజల కంటే ఎక్కువ సాల్యూబుల్ ఫైబర్ ఉంటుంది. రోజువారీ ఫైబర్ అవసరాన్ని పెంచుకోవాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. అలాగే మలబద్ధకం, విరేచనాలు వంటి రెండు సమస్యలను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరును సమతుల్యం చేయడంలో ఇసబ్గోల్ను సహజమైన పరిష్కారంగా చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఫైబర్ కోసం ఒక్క చియా గింజలపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, జీర్ణవ్యవస్థ అవసరాలను బట్టి అవిసె గింజలు, సబ్జా గింజలు లేదా ఇసబ్గోల్ వంటి ప్రత్యామ్నాయాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కూడా తగిన ఫైబర్‌ను పొందడంతోపాటు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.