Mental Health Problems | ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్ ఒక ప్రధాన మానసిక ఆరోగ్య సమస్యగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం 30 కోట్లకు పైగా ప్రజలు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని వెల్లడైంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి వైద్య చికిత్సతోపాటు సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల డిప్రెషన్ లక్షణాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని ఆయుర్వేద మూలికలు కూడా మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయని చెబుతున్నారు. అయితే వీటిని తప్పనిసరిగా ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలి.
ఆయుర్వేదంలో ఎంతో పేరుగాంచిన మూలిక బ్రహ్మి. ఇది మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచే అడాప్టోజెన్‌గా గుర్తింపు పొందింది. ఇది మెదడులో సెరోటోనిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని, దీంతో మనసు ప్రశాంతంగా ఉండటంతోపాటు ఆందోళన తగ్గే అవకాశం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో విస్తృతంగా ఉపయోగించే ఆయుర్వేద మూలిక. ఇందులో ఉండే క్రియాశీల పదార్థాలు భావోద్వేగ, శారీరక అలసట వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో శరీరం, మనసు రెండూ కొంత రిలాక్స్‌గా ఉండేందుకు దోహదపడుతుంది. జటామాంసి సహజసిద్ధమైన యాంటీ-డిప్రెసెంట్, యాంటీ-స్ట్రెస్, యాంటీ-ఫటీగ్ లక్షణాలను కలిగి ఉందని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ఇది ప్రతికూల ఆలోచనలను తగ్గించి, మనసును సానుకూల దిశగా మళ్లించడంలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
పుదీనా లేదా పెప్పర్‌మింట్‌లో ఉండే మెంథాల్ మనసుకు చల్లదనాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటు పలు ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉండటంతో శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని సువాసన కూడా మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. అయితే డిప్రెషన్ తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య. కేవలం మూలికలు లేదా ఆహార మార్పులతోనే దీనికి పూర్తి చికిత్స సాధ్యం కాదు. డిప్రెషన్ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే లేదా రోజువారీ జీవితంపై ప్రభావం చూపితే తప్పనిసరిగా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. అలాగే ఆయుర్వేద మూలికలను కూడా వైద్యుల సూచనల మేరకే వినియోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.