అలసిన మనసుకు, శరీరానికి నిద్రను మించిన ఉపశమనం లేదు. కంటి నిండా నిద్రపోయిన మర్నాడు మనసు తేలికపడుతుంది. శరీరం కొత్త శక్తిని పుంజుకున్న అనుభూతి కలుగుతుంది. కునుకు పాట్లు లేకుండా హాయిగా ఉండాలంటే ఇదిగో ఈ సూచనలు పాటించండి.
రోజూ కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని చెబుతారు నిపుణులు. అయితే, ఏ సమయంలో నిద్రకు ఉపక్రమిస్తున్నామన్నది చాలా ముఖ్యం. ఒక్కోరోజు ఒక్కో సమయంలో పవళింపు సేవ చేస్తూ పోతే జీవగడియారం గతి తప్పుతుంది. అలా జరగకూడదంటే నిద్రాదేవిని నిర్దేశిత సమయంలోనే ఆహ్వానించడం అలవాటుగా చేసుకోవాలి. ‘నిద్ర సుఖమెరుగదు’ అంటారు.
బాగా అలసిపోయినప్పుడు ఇది వర్తిస్తుందేమో కానీ, దైనందిన జీవితంలో కునుకమ్మ కంటి మీదికి చేరాలంటే పరిసరాలు బాగుండాలి. గది శుభ్రంగా ఉండాలి. దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి చక్కగా ఉండాలి. అప్పుడే గాఢ నిద్రలోకి జారుకోవచ్చు. కొందరు పక్కలోకి చేరగానే చిటికెలో నిద్దట్లోకి జారుకుంటారు. ఇంకొందరు అటూ ఇటూ పొర్లాడుతూ కుస్తీ పట్టినా కునుకు రాదు.
నిద్రకు ఉపక్రమించిన తర్వాత 20 నిమిషాల్లోగా నిద్ర పట్టిందా సరి! లేకపోతే కాసేపు అటూ ఇటూ నడిచి, పది నిమిషాలు పుస్తకం చదవడమో, శ్రావ్యమైన సంగీతం వినడమో చేసి పడుకుంటే ఇట్టే నిద్ర పట్టేస్తుంది. పడుకునే ముందే మొబైల్ఫోన్లు పక్కన పెట్టేయండి. సినిమాలు చూస్తూ పడుకోవడం అలవాటు చేసుకుంటే కలత నిదురే మిగులుతుంది. ఇదిలాగే కొనసాగితే కండ్లు దెబ్బతినే ప్రమాదమూ ఉంది.