చలికాలంలో జలుబు, ఫ్లూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు తలెత్తుతూ ఉంటాయి. వాటిని నిరోధించడానికి రోగనిరోధక శక్తి బోలెడంత అవసరమవుతుంది. సాధారణంగా మనం ఇమ్యూనిటీ అనగానే విటమిన్ సి వైపు మొగ్గు చూపుతాం. కానీ, మన రోగనిరోధక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన మరొక పోషకం జింక్. శ్వాసకోశ సమస్య నియంత్రణతోపాటు రోగనిరోధక వ్యవస్థకు ఇదొక గేట్కీపర్లా పనిచేస్తుంది.
ఎదుర్కొనే శక్తి: శరీరంలోని టీ-కణాలు, నేచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివేట్ కావడానికి జింక్ చాలా అవసరం. ఇవి వైరస్ సోకిన కణాలను గుర్తించి, వాటిని నాశనం చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో విజృంభించే ఫ్లూ వైరస్లపై ఇవి సమర్థంగా పోరాడుతాయి.
తీవ్రతను తగ్గిస్తుంది: జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ సిద్ధ మెడిసిన్ ప్రకారం జలుబు లక్షణాలు కనిపించిన వెంటనే జింక్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది. ఇది వైరస్ వేగాన్ని అడ్డుకుంటుంది. తద్వారా మనం త్వరగా కోలుకుంటాం.
రక్షణ కవచాలకు అండగా: మన ముకు, గొంతు భాగాల్లో ఉండే శ్లేష్మ పొరలు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా, మొదటి రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. ఈ పొరలను బలోపేతం చేయడంలో జింక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనివల్ల వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటాయి.
వాపు నియంత్రణ: ఇన్ఫెక్షన్ సోకినప్పుడు శరీరంలో వాపు రావడం సహజం. అయితే అది దీర్ఘకాలం ఉంటే ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. జింక్ శరీరంలోని సైటోకిన్లను నియంత్రించి, వాపును తగ్గించడంలో తోడ్పడుతుంది.
కణాల పునరుద్ధరణ: వైరస్ దాడి చేసినప్పుడు కొన్ని కణాలు దెబ్బతింటాయి. వాటిని రిపేరు చేయడానికి కొత్త రోగనిరోధక కణాల ఉత్పత్తికి జింక్ ఎంతో అవసరం. ఇది గాయాలను వేగంగా నయం చేస్తుంది.
వీటిని తీసుకోండి: తరచూ వైరస్ల బారిన పడుతున్నారంటే.. వారు జింక్ లోపంతో బాధపడుతున్నట్టు అంచనా వేయవచ్చు. ఇలాంటి వాళ్లు తాము రోజూ తినే ఆహారంలో గుమ్మడి గింజలు, నట్స్, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, సీఫుడ్ లాంటి పదార్థాలను భాగం చేసుకుంటే మంచిది. తద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడి.. శీతాకాలం రుగ్మతలకు చెక్ పెట్టినట్టు అవుతుంది.