ఆధునిక యుగంలో వైద్యరంగం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్నది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న రోగాలకు తగ్గట్టుగా.. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందుతున్నది. అయితే, మహిళలకు ఇప్పటికీ ‘సరైన వైద్యం అందని ద్రాక్షే’ అవుతున్నది. ముఖ్యంగా, ఆడవాళ్లు ఎదుర్కొనే అతిసామాన్యమైన ‘నెలసరి’ విషయంలో.. ముక్తసరి వైద్యమే అందుతున్నది. సులభ్ శానిటేషన్ మిషన్ ఫౌండేషన్ నిర్వహించిన తాజా పరిశోధన ఒకటి.. ఈ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ముంబై మహానగరంతోపాటు దేశంలోని 14 జిల్లాల్లో చేపట్టిన ఈ అధ్యయనం.. బాలికలు, మహిళల రుతుక్రమ ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించింది. మహిళా వైద్యుల కొరత వల్ల 91.7% మంది మహిళలు.. రుతుక్రమ ఆరోగ్య సమస్యలపై వైద్యులను సంప్రదించడం లేదని సర్వే తేల్చింది.
దేశంలో గైనకాలజిస్టుల కొరత తీవ్రంగా ఉన్నదనీ.. దాంతో, మహిళలు నెలసరి సమస్యలపై వైద్యులను సంప్రదించలేక పోతున్నారని చెబుతున్నది. ముఖ్యంగా.. చెరుకు పొలాలు, ఇటుకబట్టీలు, గనులు, కర్మాగారాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్టు సర్వే ప్రతినిధులు గుర్తించారు. మారుమూల పల్లెల్లోనే కాదు.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ ఇదే పరిస్థితి. అతిపెద్ద మురికివాడగా ప్రసిద్ధి చెందిన ధారావిలోనే.. వైద్యులు అందుబాటులో లేరంటూ 70.4 శాతం మంది మహిళలు చెప్పారు. గర్భాశయ సమస్యల కోసం సంప్రదించాలన్నా.. సరైన వైద్యులు అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తంచేశారు. అదే సమయంలో.. పాఠశాల విద్యార్థినులు కూడా నెలసరి విషయంలో ఇబ్బందులు పడుతున్నట్టు సర్వే గుర్తించింది. పాఠశాలల్లో సరైన వసతులు లేక.. ఆ నాలుగైదు రోజులు విద్యార్థినులు తరగతులకు గైర్హాజరు అవుతున్నారని వెల్లడించింది.
విశ్రాంతి గదుల్లో నీళ్లు లేకపోవడం, తలుపులు లాంటి సరైన రక్షణ లేకపోవడంతో.. వాటిని ఉపయోగించడానికి బాలికలు భయపడుతున్నారని అధ్యయనం కనుగొన్నది. పాఠశాలల్లో రుతుక్రమ పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడంతో.. బాలికలు ఆ సమయంలో ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఫలితంగా, ఏడాదిలో 60 రోజుల దాకా పాఠశాలకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిపై సర్వే ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా విద్యార్థినులు పాఠశాలలకు గైర్హాజరు కావడం వల్ల.. డ్రాపవుట్లకు దారితీస్తాయనీ, వారిని ఉన్నత విద్యకు దూరం చేస్తాయని అంటున్నారు. ఫలితంగా, బాల్య వివాహాలు పెరిగే అవకాశాలూ ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. వలస కుటుంబాలకు చెందిన మహిళలు, బాలికలకు చదువుతోపాటు మెరుగైన సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ కావాల్సిన అవసరం ఉన్నదని సర్వే ప్రతినిధులు చెబుతున్నారు. స్థానిక జనాభాకు అనుగుణంగా రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణ కార్యక్రమాలు అమలు చేయాలంటూ పలు సిఫార్సులను అందిస్తున్నారు.