HomeHealthThe Solution To The Problem Of Crooked Crooked Foot
Parenting | మా బాబుకు పుట్టుకతోనే వంకర పాదాలు.. భవిష్యత్తులో ఇంకేమైనా సమస్యలు వస్తాయా?
మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ బాబుకు క్లబ్ ఫుట్ (పుట్టుకతో పాదాలు వంకరగా ఉండటం) సమస్య ఉంది. పాదం లోపలికి వంగి, కిందికి తిరిగి ఉన్నట్లయితే దానిని క్లబ్ ఫుట్ అంటారు. చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. బిడ్డ నిల్చోవడం, నడవడం సమస్యాత్మకంగా మారుతుంది.
Parenting | మాకు బాబు పుట్టాడు. కడుపులో ఉన్నప్పుడే శిశువు కాళ్లు (పాదాలు) వంకరగా ఉన్నట్టు పరీక్షల ద్వారా మాకు తెలిసింది. మిగతా ఏ ఇబ్బందులూ లేవు. ఈ సమస్య పూర్తిగా తగ్గుతుందా? డాక్టర్ని కలిస్తే.. త్వరలో చికిత్స మొదలుపెడతామని చెప్పారు. ఆపరేషన్ ఏమైనా అవసరం అవుతుందా? భవిష్యత్తులో ఇంకేమైనా సమస్యలు వస్తాయా? వివరించండి!
-ఓ పాఠకురాలు
మీరు చెప్పిన వివరాల ప్రకారం మీ బాబుకు క్లబ్ ఫుట్ (పుట్టుకతో పాదాలు వంకరగా ఉండటం) సమస్య ఉంది. పాదం లోపలికి వంగి, కిందికి తిరిగి ఉన్నట్లయితే దానిని క్లబ్ ఫుట్ అంటారు. చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. బిడ్డ నిల్చోవడం, నడవడం సమస్యాత్మకంగా మారుతుంది. సాధారణంగా క్లబ్ ఫుట్ పిల్లల్లో 80 శాతం వరకు పాదాలు వంకరగా ఉండటం తప్ప, ఇతరత్రా సమస్యలేం ఉండవు. కానీ, 10 నుంచి 20 శాతం మంది శిశువుల్లో ఇతర జాయింట్స్ గట్టిగా ఉండటం, కదలికలు లేకపోవడం జరగొచ్చు. వేరే అవయవాల లోపం కూడా ఉండొచ్చు.
కేవలం క్లబ్ ఫుట్ అయితే సరైన సమయంలో చికిత్స పొందినట్లయితే మెరుగైన ఫలితం ఉంటుంది. అయితే, మీ వైద్యుడిని కలిసి అవసరమైన పరీక్షలు చేయించి, వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోండి. క్లబ్ ఫుట్ వైద్య విధానాన్ని పాన్సెటీ మెథడ్ అంటారు. ఈ విధానంలో శిశువు పుట్టిన వారం, రెండువారాల తర్వాత.. కాలును కాస్త తిప్పి, ఉండాల్సిన విధంగా ఉంచి.. చుట్టూ పట్టీ వేస్తారు. ప్రతివారం ఓపెన్ చేసి, సరైన దిశలో ఉంచి మళ్లీ పట్టీ వేస్తారు.
ఇలా చేయడం వల్ల క్రమేపీ కాలు సరి అవుతుంది. కొన్నిసార్లు పాదాలను పట్టి ఉంచే కండరాలకు శస్త్రచికిత్స అవసరం పడొచ్చు. పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. చికిత్స తర్వాత ఫిజియోథెరపీ సహకారమూ తీసుకుంటే మంచిది. అలాగే శిశువైద్య నిపుణుడ్ని సంప్రదించి మిగతా పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఏమైనా సమస్యలు ఉంటే వాటికీ చికిత్స తీసుకోవాలి. మీరు చెప్పిన వివరాల ప్రకారం కేవలం క్లబ్ ఫుట్ మాత్రమే ఉందని చెప్పొచ్చు. పైన పేర్కొన్న విధంగా వైద్యుడి సలహా మేరకు ముందుకు వెళ్లండి. కాగా, ఒక శిశువు ఈ సమస్యతో పుడితే, తర్వాత పుట్టేవారికీ ఈ రిస్క్ ఉంటుంది. క్లబ్ ఫుట్‌తో పుట్టినవారు పెరిగి పెద్దయ్యాక, వారికి పుట్టే పిల్లలకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, కేవలం పాదాలు వంకర్లు ఉంటే సమస్య లేదు. దీంతోపాటు వెన్నెముక, ఇతర జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటే ఈ తరహా రిస్క్ ఉంటుంది.