వాతావరణంలో పెరుగుతున్న వేడి, గాలిలో అధికం అవుతున్న కార్బన్ డయాక్సైడ్లు పంట పెరుగుదలనే కాదు అందులోని పోషకాలనూ దెబ్బతీస్తున్నాయని ఇటీవల ఓ పరిశోధన వెల్లడించింది. అందులోనూ ముఖ్యంగా ఆకుకూరల్లో ఇది అధికం అని లండన్ లివర్పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనంలో తేలింది. ఇందుకోసం పంటల్ని విశ్వవిద్యాలయ పరిసరాల్లోనే నియంతృత వాతావరణంలో పెంచారు.
బ్రిటన్లో రానున్న రోజుల్లో అంచనా వేసిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉష్ణోగ్రత, కార్బన్ డయాక్సైడ్లు ఉండేలా ఏర్పాటు చేశారు. ఆ రకంగా పండిన పంటల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయన్నది హై పర్ఫామెన్స్ లిక్విడ్ క్రొమొటోగ్రఫీలాంటి అత్యంత సునిశిత పద్ధతుల్ని వాడి తెలుసుకున్నారు.
పరిశోధనలో భాగంగా పాలకూర, అరుగుల ఆకు, కాలేలాంటి ఆకుకూరల్ని ప్రధానంగా పండించారు. వీటిలోని విటమిన్లు, మినరళ్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటి ఆక్సిడెంట్లలాంటి వాటిని పరిశీలించారు. ఈ నివేదిక ప్రకారం కిరణ జన్య సంయోగ క్రియ మొదలు… పెరుగుదల, పోషకాల నిల్వ లాంటి అన్ని విషయాల్లోనూ పంటలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగానే ఉన్నట్టు తేలింది.
ఈ వాతావరణంలో మొక్కలు త్వరగా, పెద్దగా పెరుగుతున్నాయి. కానీ కొద్దికాలం గడిచేలోపే వాటిలోని యాంటి ఆక్సిడెంట్లు, క్యాల్షియంలాంటి అత్యవసర పోషకాలు సన్నగిల్లుతున్నాయి. కాబట్టి మునుముందు మనకు ఆహారం ద్వారా అందే పోషకాల స్థాయి మీదా భూతాపం ప్రభావాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట.