వేడి వేడి సమోసానో, గరం గరం చాయ్నో నోట్లో పెట్టుకోగానే కాలడం అందరికీ అనుభవమే. నిజానికి ఇది చిన్న అసౌకర్యం మాత్రమే. కొన్ని గంటలో, ఒకట్రెండు రోజులో బాధించే ఈ సమస్య పరిష్కారానికి ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.
నోరు కాలినప్పుడు చల్లటి పాలు తాగితే మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. పాలలో కేసిన్ లాంటి ప్రొటీన్లు ఉంటాయి. ఇవి కాలిన కణజాలంపై పూతగా అమరిపోతాయి. దాంతో మనకు ఉపశమనం లభిస్తుంది. చల్లటి పాలను కొద్దికొద్దిగా తాగుతూ కొన్ని సెకండ్ల పాటు నోట్లోనే ఉంచుకుని మింగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నోరు కాలిన సందర్భాల్లో తేనె కూడా గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి తేనెను కాలిన చోట పూస్తే బాధ చాలావరకు తగ్గిపోతుంది. ఒక చెంచాడు తేనె తీసుకుని కాలిన చోట పూతలా పూసి నోట్లో నెమ్మదిగా కరిగిపోనివ్వాలి. రోజంతా తరచూ ఇలా చేస్తుండాలి.
కాలిన గాయాల చికిత్సలో నెయ్యిని వందల ఏండ్లుగా ఉపయోగిస్తూనే ఉన్నారు. దీనికున్న చల్లబరిచే గుణాలు నోటి మంటకూ ఉపశమనం కలిగిస్తాయి. వేలిని శుభ్రం చేసుకొని, నెయ్యి అద్దుకొని నోట్లో కాలిన చోట పూతగా రాయాలి. కాలిన వెంటనే ఇలా చేస్తే మంచిది.
కలబందకు చల్లబరిచే, గాయాలను తగ్గించే గుణాలు ఉన్నాయి. వేడి కారణంగా నోరు కాలితే వెంటనే కలబంద గుజ్జును పూయాలి. దీంతో మంట తగ్గిపోతుంది. తొందరగా ఉపశమనం దొరుకుతుంది.
అధిక వేడి వల్ల నోరు కాలినప్పుడు పెరుగు కూడా మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. చల్లదనం, పొరలా ఉండే లక్షణం కాలిన కణజాలాన్ని బాగుచేసి మంటను తగ్గిస్తుంది. ఓ చెంచాడు పెరుగు తీసుకుని కొన్ని సెకండ్లపాటు నోట్లో ఉంచుకొని మింగేయాలి.
చక్కెర నోట్లో వేసుకున్నా మంచి ఫలితమే కనిపిస్తుంది. చక్కెర నోట్లో లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కాబట్టి నోరు కాలిన సందర్భాల్లో కొంచెం చక్కెరను నోట్లో వేసుకోవాలి. నెమ్మదిగా కరిగిపోయేలా చప్పరించాలి. ఈ చిట్కా కూడా త్వరిత ఉపశమనాన్ని ఇస్తుంది.