మన శరీర ఆరోగ్యంలో గుండెతోపాటు కాలేయం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, గుండె గురించి తెలుసుకున్నంతగా కాలేయం గురించి చాలామందికి అవగాహన ఉండదు. శరీరంలో అతిపెద్ద గ్రంథి అయిన కాలేయం తనను తాను బాగు చేసుకునే సామర్థ్యం కలిగిన ఏకైక అవయవం. ఎవరికైనా కాలేయంలో కొంత భాగం దానమిచ్చినా మూడు నాలుగు నెలల్లో ముందు రూపంలోకి వస్తుంది. పైగా దానం తీసుకున్న వ్యక్తిలో కూడా కాలేయం పెరిగి పూర్తి రూపాన్ని దాలుస్తుంది. అందుకే కాలేయాన్ని మన శరీర డాక్టర్ అని పిలుస్తారు.
కానీ కొన్ని పదార్థాలు కాలేయాన్ని జబ్బుల బారినపడేస్తాయి. మితిమీరిన మద్యపానం, కొవ్వులు ఉన్న ఆహారం తినడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం లాంటివి కాలేయం ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, కాలేయం మేలు కోసం ఆహారం, జీవనశైలి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు తినాలి. ఫైబర్ ఉన్న ఆహారాలు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువును తగ్గిస్తాయి. దీంతో కాలేయం మీద ఒత్తిడి తక్కువగా పడుతుంది. సలాడ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సలాడ్లు తినడం వల్ల శరీరంలో పేరుకున్న టాక్సిన్లు బయటికి వెళ్లిపోతాయి.
నూనెలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం కాలేయానికి చేటు చేస్తుంది. అందువల్ల తక్కువ నూనెతో చేసినవి, డీప్ ఫ్రై చేయనివి తీసుకోవాలి. ఉడికించినవి, వేయించినవి తినడం మంచిది. పూరీలు, పరాఠాలు ఎక్కువగా తినకూడదు. కూరగాయల్లో కూడా నూనె తక్కువగా ఉపయోగించాలి.

కాలేయం సరిగ్గా పనిచేయాలంటే శరీరానికి తగినన్ని నీళ్లు అందాలి. కాబట్టి, రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలి. దీంతో శరీరం నుంచి మలినాలు సహజంగా బయటికి విసర్జితమైపోతాయి.

కాలేయమైనా, మరో ఇతర అవయవమైనా శరీరంలో కొవ్వు అధికంగా పేరుకోవడం ప్రమాదకరం. కాలేయం ఆరోగ్యానికి రోజూ ఏదో ఒక ఫిట్నెస్ వ్యాయామం తప్పకుండా చేయాలి. తిన్నది అరగడం కోసం నడవాలి. రోజుకు 40 నుంచి 45 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే అధిక చక్కెరలు ఉన్న ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోకూడదు. ప్యాక్డ్ పండ్లరసాలు, సాఫ్ట్ డ్రింక్స్‌ను దూరం పెట్టాలి. మద్యపానం కాలేయానికి బద్ధశత్రువు. కాబట్టి ఆల్కహాల్‌ను పూర్తిగా వదిలించుకోవాలి.