గతంలో వృద్ధాప్యం కారణంగా వెన్నునొప్పి వచ్చేది. కానీ ఇప్పుడు వివిధ కారణాల వల్ల చిన్న వయస్సులోనే చాలామందికి బ్యాక్ పెయిన్ వస్తోంది. రోడ్డుప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాల వల్ల కూడా చాలామందిలో వెన్నునొప్పి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో వైకల్యానికి ప్రధాన కారణాల్లో వెన్నునొప్పి ఒకటని 2018లో లాన్సెట్ వెల్లడించింది.
వెన్నునొప్పిని తగ్గించుకోవాలంటే యోగా, కొన్నిరకాల ఎక్సర్సైజులు ఉత్తమ మార్గాలు. చాలామంది వైద్యులు మందులతోపాటు మనకు వీటిని సూచిస్తారు. ఇదిలా ఉండగా, కొన్నిరకాల ఆహార పదార్థాలతో వెన్నునొప్పికి లింక్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. వాటిని మానేస్తే దీనినుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
1. గ్లూటెన్‌కు గుడ్ బై చెప్పాలి..
మెడికల్ హైపోథీసెస్ జర్నల్‌లో ప్రచురితమైన 2020 అధ్యయనం ప్రకారం, గ్లూటెన్ అనేది దీర్ఘకాలిక వెన్నునొప్పికి కారణమవుతుంది. అందువల్ల, గ్లూటెన్‌కు దూరంగా ఉంటే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. గ్లూటెన్ అనేది గోధుమలు, బార్లీ , రై లాంటి వాటిలో లభించే ప్రొటీన్. గ్లూటెన్ ఫ్రీ ఆహారాన్ని తీసుకుంటే వెన్నునొప్పి 80 శాతం మెరుగుపడుతుంది.
2. కొవ్వు పదార్థాలు కట్‌చేయాలి..
కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్నిసార్లు కొవ్వులు పిత్తాశయంలో మంటను కలిగిస్తాయి. పిత్తాశయం మన తీసుకున్న ఆహారంలో కొవ్వులను విచ్ఛిన్నం చేసేందుకు బైల్ ను ఉత్పత్తి చేస్తుంది. పిత్తాశయంలో ఎక్కువశాతం కొవ్వు పేరుకుపోయినప్పుడు పొత్తికడుపు పైభాగంలో వాపు, నొప్పి వెనుకకు ప్రసరిస్తుంది. ఇది వెన్నునొప్పికి కారణమవుతుంది.
3. చక్కెరకు చెక్ పెట్టాలి..
చక్కెర అనేది అనారోగ్యకర ఆహారం. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ, బరువు పెరుగుట, ఊబకాయానికి కారణమవుతుంది. కొన్నిసార్లు అధిక కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది. దీర్ఘకాలిక మంట, నొప్పికి కూడా కారణమవుతుంది. అందువల్ల వెన్నునొప్పిని తగ్గించుకోవాలంటే చక్కెరకు చెక్ చెప్పాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.