క్యాన్సర్ చికిత్సకు సంబంధించి, రేడియేషన్ థెరపీలో వచ్చిన అత్యాధునిక చికిత్సా విధానమే.. ‘సైబర్ నైఫ్’ పద్ధతి. ఇది క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పు. ఈ పద్ధతిలో ఎలాంటి కోత లేకుండానే రోగికి చికిత్స అందించవచ్చు. ఎంత చిన్న క్యాన్సర్ కణితినైనా తొలగించవచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకపోవడం దీనికున్న అదనపు ప్రత్యేకత.
సున్నిత ప్రాంతాల్లో చికిత్స సులభం :
మెదడు, వెన్నెముక, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, ప్యాంక్రియాస్ వంటి భాగాలలో వచ్చిణ కణుతులు, చాలా చిన్న కణుతులను తొలగించాల్సి వచ్చినప్పుడు సర్జరీ కష్ట సాధ్యం. ఇలాంటి సందర్భాలతోపాటు ఎలాంటి కోత లేకుండా కేవలం క్యాన్సర్ కణితిని మాత్రమే ‘మిస్సైల్ టెక్నాలజీ’తో మటుమాయం చేయగలిగే రేడియేషన్ పద్ధతిని రోబోటిక్ రేడియో సర్జరీ అంటారు. మనిషి ఇచ్చే సూచనలతో క్యాన్సర్ కణాలే లక్ష్యంగా, శరీరంలో ఏ భాగాన్నయినా చేరగలిగి, కచ్చితమైన చికిత్స అందించే ఈ రేడియేషన్‌ను ‘సైబర్ నైఫ్’ అని కూడా అంటారు.
120 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న రేడియేషన్‌ను 1896 నుంచి క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరి.. పొలోనియం, రేడియం వంటి రేడియో యాక్టివ్ మూలకాలను కనుగొన్నాక, ఈ చికిత్స మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. శతాబ్ద కాలంలో ఈ థెరపీలో ఊహించని మార్పులు, ఆధునికతలు చోటు చేసుకున్నాయి. 1970కు ముందు CT సహాయంతో 2-D గా ఉండే రేడియేషన్, 1970 తర్వాత MRI, తర్వాత 1980లలో PET వంటి వాటితో 3-D గానే కాకుండా ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వగలుగుతున్నారు.
బ్రాకీథెరపీ, స్టీరియో టాక్టిక్ రేడియేషన్, రేడియో ఐసోటోప్ థెరపీ, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్లతో IMRT, IGRT వంటి ఎన్నో కొత్త పద్ధతులు ఈ థెరపీలో చోటు చేసుకుంటున్నాయి. అయితే రేడియేషన్‌ను తగిన మోతాదులో ఇవ్వకపోవడం వలన, క్యాన్సర్ కణం లొంగకపోవడం కానీ, మోతాదు ఎక్కువైన సందర్భాల్లో ఇతర అవయవాలకు రేడియేషన్ ప్రభావం వలన క్యాన్సర్ వచ్చి మరణాలు సంభవించిన సందర్భాలూ ఉన్నాయి. రేడియేషన్ పరిమాణాన్ని ‘గ్రే’లతో పోలుస్తారు. 10 గ్రేలతో జుట్టు రాలిపోతే, 45 ‘గ్రే’లను మించితే శాశ్వతంగా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. రేడియేషన్ క్యాన్సర్ కణితికే కాకుండా ఇతర అవయవాలకు, కణాలకు సోకినప్పుడు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతూ ఉంటాయి. వీటిలో కొన్ని తాత్కాలికం అయితే, మరికొన్ని శాశ్వతంగా ప్రభావం చూపించేవీ ఉంటాయి.
రేడియేషన్ ఇచ్చిన అవయవం మీద ఆధారపడి వాంతులు, వికారం, వాపు, చర్మం కమిలిపోవడం, సాగే గుణం కోల్పోవడం, నోటిలో పుళ్లు, జుట్టు రాలిపోవడం, సంతానలేమి సమస్యలు.. ఇలా రకరకాలైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇవన్నీ రేడియేషన్ తీసుకునేటప్పుడు పక్కభాగాలపైనా ఆ ప్రభావం పడటం వల్ల తలెత్తేవి. బ్రెస్ట్ క్యాన్సర్‌కు రేడియేషన్ తీసుకున్నప్పుడు గుండె మీద ప్రభావం పడటం, బ్రెయిన్ ట్యూమర్‌కు ఇచ్చే రేడియేషన్ వల్ల చురుకుదనం, గుర్తించే శక్తి కోల్పోవడం కూడా జరగవచ్చు. కత్తి అవసరం లేకుండా రేడియేషన్‌తో రేడియో సర్జరీ చేసి, కణితిని తొలగించగలగడం ఇప్పుడు పెన్సిల్ బీమ్‌తో.. అంటే పాయింటెడ్ రోబోలతో మనిషి ఇచ్చే సూచనల సహాయంతో కచ్చితంగా చేయగలుగుతున్నాం.
‘సైబర్ నైఫ్’ ప్రయోజనాలు :
రోగి వయసు, క్యాన్సర్ దశ, కణితి గ్రేడింగ్, క్యాన్సర్ కణితి ఉన్న అవయవం మొదలైన అంశాలను బట్టి క్యాన్సర్ చికిత్స కోసం రోబోటిక్ రేడియో సర్జరీని నిర్ణయిస్తారు. కొన్నిసార్లు క్యాన్సర్ తిరగబెట్టిన అవయవానికి లేదా వాల్యుమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ (Volumetric Modulated Arc Therapy / VMAT) ఇంకా ఇతర రేడియేషన్ పద్ధతులతోపాటు ఈ సైబర్ నైఫ్ చికిత్స కూడా అవసరం ఉండవచ్చు.
– డాక్టర్ మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ 98490 22121