మన శరీరంలోని ప్రతి భాగమూ దానికంటూ ప్రత్యేకమైన పనిని చేస్తున్నప్పటికీ మెదడు పనితీరు చాలా భిన్నమైనది. దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇదే తరహాలో ఇటీవల అమెరికా మిషిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ పరిశోధనను మాలిక్యులర్ మెటబాలిజం అనే మెడికల్ జర్నల్ ప్రచురించింది. దీని ప్రకారం మన శరీరంలో గ్లూకోజ్ స్థాయులు రాత్రి పూట ఉన్నట్టుండి పడిపోకుండా ఉండేందుకు మెదడులోని హైపోథలామస్లో ఉండే కొన్ని న్యూరాన్లు రాత్రిపూట మనం నిద్రపోయేటప్పుడు కూడా పనిచేస్తుంటాయట. శరీరంలోని కొవ్వుని కరిగించడం ద్వారా గ్లూకోజ్ స్థాయుల్ని సమతులీకరించడానికి ఇవి ప్రయత్నిస్తుంటాయి. సాధారణంగా హైపోథలామస్ అనేది ఆకలి, నిద్ర, దాహం, శరీర ఉష్ణోగ్రతలాంటి ఎన్నో క్రియల్ని నియంత్రిస్తూ ఉంటుంది. అదే విధంగా శరీరం హైపోగ్లిసెమిక్ (ప్రమాదకర స్థాయిలో అమాంతం షుగర్ లెవెల్స్ పడిపోవడం) బారిన పడకుండా ఈ ప్రాంతంలోని న్యూరాన్లే పనిచేస్తుంటాయి.
మనం నిద్రపోయాక మొదటి నాలుగు గంటల్లో అవి ఈ పనిని నిర్వర్తిస్తాయని ఈ పరిశోధన తేల్చింది. ఇందుకోసం హైపోథలామస్లో ఉండే వీఎంహెచ్ అని పిలిచే న్యూరాన్ల మీద సైంటిస్టులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉపవాసం ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు తదితర సందర్భాలతో పాటు రోజువారీ కూడా శరీరంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉండేలా ఇవి పనిచేస్తాయి. కాబట్టి మనం రాత్రిపూట ఉన్నట్టుండి షుగర్ డౌన్ అయి ప్రమాదంలో పడకుండా కూడా ఇవే కాపాడతాయి. వీటితో పాటుగా మరికొన్ని ప్రత్యేక న్యూరాన్లు కూడా అనుసంధానం అయి సాధారణ సమయాల్లోనూ గ్లూకోజ్ స్థాయుల్ని నియంత్రిస్తుంటాయని అధ్యయనం వెల్లడిస్తున్నది. దీన్ని బట్టి షుగర్ స్థాయులు పెరగడం అన్నది స్విచ్ వేసినట్టు, ఆపినట్టుగా పనిచేసే క్రియగా ఇన్నాళ్లూ అనుకున్నది తప్పు అని అర్థం చేసుకోవచ్చు. ఇక, ప్రీ డయాబెటిస్లలో కూడా అంటే షుగర్ వ్యాధి వచ్చే సూచనలున్న వారిలో కూడా రాత్రిపూట ఈ వీఎంహెచ్ న్యూరాన్లు పనిచేస్తాయి. అయితే వాళ్లలో ఇవి ఎక్కువగా ప్రతిస్పందిస్తుడటం వల్ల షుగర్ స్థాయులు అధికం అవడంలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయట.