Tea Or Coffee | మన దేశంలో టీ, కాఫీలు ఎక్కువగా తాగే పానీయాలు అని చెప్పవచ్చు. టీ లేదా కాఫీలను దాదాపు ఉదయం పూట ప్రతి ఒక్కరి ఇంట్లో తాగుతారని చెప్పవచ్చు. కొందరైతే వారి రోజును టీ, కాఫీలతోనే ప్రారంభిస్తారు. ఉదయం పూట వీటిని తాగనిదే వారికి రోజు గడిచినట్టుగా ఉండదు. శక్తి, ప్రేగు కదలికలకు, శరీరం ఉత్తేజానికి ఎవరి రుచిని బట్టి వారు టీ లేదా కాఫీలను తాగుతూ ఉంటారు. ఇవి రెండు కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందించినప్పటికీ దేనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి మేలు కలుగుతుంది అనే సందేహం మనలో చాలా మందికి వస్తూనే ఉంటుంది. నిజానికి టీ, కాఫీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వివిధ ఆరోగ్యప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ వీటిలో ఉండే కెఫిన్ మోతాదులో చాలా వ్యత్యాసం ఉంటుంది. టీ లో కంటే కాఫీలో రెండు రెట్లు ఎక్కువగా కెఫిన్ ఉంటుంది. కాఫీలో 80 నుండి 100మి.గ్రా., టీలో 30 నుండి 50 మి.గ్రా. కెఫిన్ ఉంటుంది.
కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీని తీసుకోవడం వల్ల మనకు మరింత శక్తి లభిస్తుంది. శారీరక పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కెఫిన్ మోతాదును తట్టుకునే వారికి, ఎల్లప్పుడూ బలమైన మానసిక, శారీరక ప్రోత్సాహాన్ని కోరుకునే వారికి, ఉదయం పూట వ్యాయామాలు చేసే వారికి కాఫీ మంచి ఎంపిక అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాఫీని తీసుకోవడం వల్ల దానిలో ఉండే సమ్మేళనాలు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లక్షణాలను ప్రేరేపిస్తాయి. దీంతో జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కనుక కాఫీ అందరికి తగినది కాదని చెప్పవచ్చు. ఇక టీ విషయానికి వస్తే టీ పొట్టకు చాలా తేలికగా ఉంటుంది. ఇందులో కెఫిన్ తక్కువగా ఉంటుంది. అలాగే అల్లం, మసాలా వంటి టీలను తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఇక దేనిని ఎంచుకోవాలి అనే విషయానికి వస్తే అది మీ రుచి, ప్రాధాన్యత మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది టీ, కాఫీ రెండింటిని తాగుతూ ఉంటారు. అయితే అధిక కెఫిన్ ను తీసుకోవడం వల్ల జీర్ణసమస్యలకు, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి అని భావించే వారు హెర్బల్ టీలను తీసుకోవడం మంచిది. అదే విధంగా FDA సాధారణ కెఫిన్ మార్గదర్శకాల ప్రకారం మనం రోజుకు 400మి.గ్రా. ల కంటే ఎక్కువ కెఫిన్ ను తీసుకోకూడదు. కాఫీ లేదా టీ దేనిని తీసుకున్నా కూడా ముందుగా వాటిపై ఉండే లేబుల్స్ ను చూసి తీసుకోవడం మంచిది. అలాగే వాటిలో ఎంత మోతాదులో పాలు, చక్కెర వంటి వాటిని కలపాలో ముందుగానే తెలుసుకోవడం మంచిది. అలాగే టీ లేదా కాఫీ దేనిని తీసుకున్న కూడా చక్కెర మోతాదు తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.