Tattoo | ప్రస్తుతం టాటూలకు క్రేజ్ భారీగా ఉన్నది. ముఖ్యంగా యువత టాటూలు వేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నటి వరకు విదేశాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ టాటూ సంస్కృతి ఇప్పుడు భారత్‌లోనూ కనిపిస్తున్నది. అయితే స్టయిలిష్‌గా కనిపించేందుకు టాటూలు వేయించుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, ఈ టాటూలతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. టాటూలు వేయించుకోవడం.. ఆ తర్వాత వాటిని తొలగించడం రెండూ ఆరోగ్యానికి ప్రమాదమేనని చెబుతున్నాయి. స్వీడల్లో ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో టాటూ వేయించుకోవడం, దాన్ని తొలగించడం వల్ల లింఫోమా ప్రమాదం పెరుగుతుందని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. లింఫోమా అనేది ఒక రకమైన చర్మం క్యాన్సర్. టాటూ వేయించుకోవడం వల్ల చర్మం ఇన్ఫెక్షన్, అలెర్జీ, మచ్చలు వంటి సమస్యలు సహా అనేక ప్రమాదాలుంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. లైసెన్స్ లేని చోట్ల టాటూలు వేయించుకున్న వ్యక్తుల గాయాలు చాలాకాలం పాటు నయం కాలేదని.. తీవ్రమైన ఇన్ఫెక్షన్ సైతం బారినపడ్డారని నివేదిక తెలిపింది.
నిపుణుల బృందం టాటూ వేయించుకున్న, తొలగించుకునేందుకు క్లినిక్‌లకు వెళ్తున్న వ్యక్తులపై అధ్యయనం చేసింది. ప్యూ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 25శాతం మంది ఇప్పుడు టాటూలు వేయించుకున్నందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. న్యాచురల్ లుక్‌పై మళ్లీ కోరిక పెరుగుతోందని.. యూఎస్, యూరప్‌లో ప్రస్తుతం చాలామంది టాటూలకు దూరంగా ఉంటున్నారు. టాటూలు తమ చర్మ సహజ సౌందర్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని జనం విశ్వసిస్తున్నారని నివేదిక పేర్కొంది. అందుకే ఇప్పుడు ప్రజలు తమ టాటూలను తొలగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యక్తిగత ఆలోచనలతో పాటు మత విశ్వాసాలు, సామాజిక వాతావరణం టాటూలను తొలగించుకునేందుకు ప్రధాన కారణాలని తెలిపింది.
టాటూలు, క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధకులు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. చాలా అధ్యయనాలు టాటూ వేసుకోవడం వల్ల మాత్రమే చర్మ క్యాన్సర్ రాదని చెబుతుండగా.. టాటూ ఇంక్‌లో ప్రమాదాన్ని పెంచే పలు పదార్థాలు ఉండవచ్చని చెబుతున్నారు. కొన్ని టాటూ ఇంక్‌లలో ‘అజో’ అనే పదార్థం గుర్తించారు. టాటూ వేయించుకోవడానికి ఉపయోగించే ఇంక్‌లో దాదాపు 83 శాతం పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) అని పిలువబడే మూలకాలను కలిగి ఉండవచ్చని ఆస్ట్రేలియన్ ప్రభుత్వం 2016లో చేసిన నివేదిక గుర్తించింది. ఇవి క్యాన్సర్ కారకాలుగా తేల్చారు.
అమెరికన్ మీడియా నివేదిక ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా టాటూ ఇంక్ వల్ల ప్రజలకు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని చాలా ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది తమకు ఇంక్ కారణంగా అలెర్జీ ఉన్నట్లుగా తెలిపారు. టాటూ ఇంక్లోరెండు ప్రధాన భాగాలుంటాయి. అవి పిగ్మెంట్, క్యారియర్ సొల్యూషన్. ఇంక్ రసాయన విశ్లేషన్లో కొన్ని ఇంక్‌లలో ఉత్పత్తి లేబుల్‌లో జాబితా చేయని ఇథనాల్ వంటి పదార్థాలు ఉన్నట్లుగా తేలింది. ఈ పిగ్మెంట్ ఆరోగ్యానిక హానికరం కాదని.. కానీ, బ్యాక్టీరియా, అతినీల లోహిత కిరణాల వంటి వాటిని నైట్రోజన్ ఆధారిత సమ్మేళనాలుగా మార్చగలిగే అవకాశం ఉందని.. ఫలితంగా చర్మ క్యాన్సర్ ప్రమాదం కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, టాటూతో క్యాన్సర్ వస్తుందని ధ్రువీకరించిన నివేదికలు ఏమీ లేనప్పటికీ.. టాటూలు వేసేందుకు ఉపయోగించే ఇంక్ మాత్రం ప్రమాదకరమేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం సర్టిఫైడ్ సెంటర్స్‌లో మాత్రమే టాటూలు వేసుకోవాలని.. ట్రైయినింగ్ లేని వ్యక్తులతో టాటూలు వేసుకుంటే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.