Walnuts | మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్ కూడా ఒకటి. వాల్నట్స్ మన ఆరోగ్యానికి ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. వాల్నట్స్ లో సూక్ష్మ పోషకాలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, పురుషులలో సంతానోత్పత్తిని పెంచడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, క్యాన్సర్ పెరుగుదలను నిరోధించడంలో ఇలా అనేక రకాలుగా వాల్నట్స్ మనకు సహాయపడతాయి. వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి.
అలాగే వాల్నట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా కాపాడడంలో సహాయపడతాయి. వాల్నట్స్ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు అభివృద్దికి సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల అభిజ్ఞా పనితీరుతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అల్జీమర్స్, మతిమరుపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారు వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి తక్కువగా అవుతుంది. అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది.
వాల్నట్స్ లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తనాళాలను సడలించడంలో, రక్తప్రవాహాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. రక్తపోటుతో బాధపడే వారు వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వాల్నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఇ కూడా ఉంటుంది. శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి మనకు తోడ్పడతాయి. వాల్నట్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి. ఇవి మొత్తం శరీర శ్రేయస్సును, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి.
వాల్నట్స్ లో పాలీఫినాల్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. వాల్నట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. తద్వారా జీర్ణక్రియతో పాటు జీర్ణవ్యవస్థ మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈవిధంగా వాల్నట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.